కర్నాటకలో భద్రాద్రి సీతారాముల కల్యాణం

భద్రాచలం,వెలుగు : కర్నాటక రాష్ట్రంలోని కోలార్​ టౌన్​లో బుధవారం భద్రాద్రి సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి కల్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామికి విశేషంగా అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించారు.

సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చారు. స్వామికి ఆవు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో పంచామృతాభిషేకం చేశారు. సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం చేసి, భక్తులకు పసుపు ముద్దలు పంపిణీ చేశారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన అనంతరం బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం జరిగింది. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత సాయంత్రం దర్బారు సేవ చేశారు.