భద్రాచలం,వెలుగు : ఆంధ్రా విలీన వీఆర్పురం మండలం శ్రీరామగిరిలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. రామరథంతో పాటు స్వామివారి విగ్రహాలను తీసుకెళ్లారు. అక్కడ భక్తుల సమక్షంలో స్వామికి విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ,యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక వరుస క్రమంలో కల్యాణ క్రతువును నిర్వహించారు. మంత్రపుష్పంతో వేడుక ముగిసింది.
భద్రాచలంలో స్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి, బంగారు పుష్పాలతో అర్చన జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేసవి నేపథ్యంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు చల్లటి మజ్జిగను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈవో ఎల్రమాదేవి ప్రారంభించారు.
క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిత్యం మజ్జిగను ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన దుర్గాప్రసాద్, అరుణ దంపతులు రూ.1లక్ష, హైదరాబాద్ మణికొండకు చెందిన గోపీనాథ్ రూ.1 లక్ష చొప్పున శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి విరాళం అందించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది.