
ధర్మపురి/జగిత్యాల టౌన్, వెలుగు: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పుట్ట బంగారంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజులపాటు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సోమవారం రాత్రి పుట్ట బంగారం పూజలు జరగ్గా..నారసింహుని కల్యాణం 11న మంగళవారం రాత్రి నిర్వహించనున్నారు.
14న తెప్పోత్సవం, డోలోత్సవం, 15న ఉగ్ర నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం, 16న వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, 19న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం జరగనుంది. ఇవే కాకుండా 20 నుంచి స్వామి వారి ఏకాంత ఉత్సవాలు జరుగుతాయి.
కొండగట్టులో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో సోమవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున తిరు మంజనం ప్రారంభించి ఆరాధన, పవిత్రాహ్వానం, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, యాగశాల ప్రవేశం స్థాపిత దేవతార్చన, అగ్నిప్రతిష్ట హావనం, అభిషేకం, అర్చన, మహానివేదన, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్, స్థానాచర్యుడు కపిందర్, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, జితేందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.