అభిమానులకు కమల్ హాసన్ లేఖ: నేనెప్పుడూ విద్యార్థినే.. ఇకపై నన్ను అలా పిలవొద్దు

అభిమానులకు కమల్ హాసన్ లేఖ: నేనెప్పుడూ విద్యార్థినే.. ఇకపై నన్ను అలా పిలవొద్దు

విశ్వ నటుడు, లోకనాయకుడు, ఉలగనాయగన్.. ఇవన్నీ ఎవరి బిరుదులో.. ఈ పేర్లు ఎవరికి సూట్ అవుతాయో సినీ అభిమానుల అందరికీ తెలిసిందే. ఈ గొప్ప పదాలు వర్తించేది అదొక్క కమల్ హాసన్ (Kamal Haasan) కి మాత్రమే. కానీ, హీరో కమల్ హాసన్ తన అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  

హీరో కమల్ హాసన్ ఇవాళ సోమవారం (నవంబర్ 11న) ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

"వనక్కం.. నన్ను చాలా కాలంగా ఉలగనాయగన్ తోపాటు వివిధ పేర్లతో పిలుస్తుండటాన్ని నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను. దీనికి మీకు రుణపడి ఉంటాను. ఉలగనాయగన్ వంటి ఎన్నో బిరుదులను అందించినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. మీరు నాపై చూపిన ప్రేమ నన్నెప్పుడూ కదిలించి వేస్తుంది" అని కమల్ అన్నాడు. అలాగే 'సినిమా అనేది ఓ వ్యక్తి కంటే ఎంతో గొప్పది. ఈ కళలో నేనో నిత్య విద్యార్థిని. ఆ రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని.. మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. ఇతర కళల మాదిరిగానే సినిమా కూడా అందరికీ చెందినది. ఎంతో మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సహకారంతో నడిచేది కళ. అందువల్ల నేను అలాంటి అన్ని బిరుదులను (స్టార్‌ ట్యాగ్స్‌) ఎంతో మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను" అని కమల్ స్పష్టం చేశాడు.

ALSO READ | Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మపై పోలీస్ కేసు.. ఎందుకంటే?

"అందుకే ఇప్పటి నుంచి నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని మాత్రమే పిలవాలని నా అభిమానులు, మీడియా, సినిమా ఇండస్ట్రీ సభ్యులు, పార్టీ క్యాడర్, సాటి భారతీయులను కోరుతున్నాను. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు మరోసారి థ్యాంక్స్. ఈ నిర్ణయం ఎంతో వినయపూర్వకంగా తీసుకున్నదని, అందరిలో నన్నూ ఒకడిగా భావించాలన్న ఉద్దేశంతో తీసుకున్నదే" అని ఈ సందర్బంగా కమల్ హాసన్ లేఖలో వెల్లడించారు. దాంతో విశ్వ నటుడు, లోకనాయకుడు, ఉలగనాయగన్ పదాలు ముందులేకుండా సంబోధించడం కష్టం అంటూ సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెసేజెస్ పెడుతున్నారు. 

ఇకపోతే కమల్ హాసన్ తన బ్యానర్లో (రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్) వరుస సినిమాలు నిర్మిస్తూ, నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2025 జూన్ 5న రిలీజ్ కానుంది.