న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కాంగ్రెస్‌ను వీడుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ నేత సజ్జన్ సింగ్ వర్మ తోసిపుచ్చారు. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్ ఇద్దరూ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చింద్వారా నుంచి పోటీ చేస్తారని వర్మ తెలిపారు. ఆదివారం తన నివాసంలో వర్మ మీడియాతో మాట్లాడారు. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, చింద్వాడా ఎంపీ నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరతారనేది అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. ‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను విజయవంతం చేయడం కోసం త్వరలో భోపాల్‌లో సమావేశం నిర్వహిస్తానని కమల్ నాథ్చెప్పారు” అని తెలిపారు. ‘‘నేను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్‌లు అందరినీ పిలిపించి లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తానని కమల్ నాథ్ నాతో చెప్పారు. మీడియాలో వస్తున్న ఊహాగానాల గురించి ఆయన్ను అడిగాను. ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలకు, ప్రచారాలకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదన్నారు” అంటూ వర్మ వివరణ ఇచ్చారు. కాగా, ఢిల్లీలోని కమల్ నాథ్ నివాసంపై ఆదివారం ఎగరవేసిన ‘‘జై శ్రీరామ్” జెండాను తొలగించారు. ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారానికి ఈ జెండా ఊతమిస్తోందని ఈ నిర్ణయం తీసుకున్నారు.