Doug Emhoff: వివాహేతర సంబంధం ఉండేది.. ఒప్పుకున్న కమలా హారిస్ భర్త

Doug Emhoff: వివాహేతర సంబంధం ఉండేది.. ఒప్పుకున్న  కమలా హారిస్ భర్త

వాషింగ్టన్ డీసీ: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ క్రెయిగ్ ఎంహోఫ్ కీలక విషయాన్ని బయటపెట్టారు. మొదటి భార్యతో పెళ్లి తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటీష్ టాబ్లాయిడ్ డైలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. కమలా హారిస్ను డగ్లస్ క్రెయిగ్ ఎంహోఫ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కెర్స్టిన్ మాకిన్తో తొలుత ఆయనకు వివాహమైంది. 

డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. 2009 సమయంలో తన పిల్లలు చదివే స్కూల్లో పనిచేసే  ఒక టీచర్తో ఎంహోఫ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఆ టీచర్ గర్భం దాల్చింది. అయితే ఆమె తన గర్భాన్ని ఉంచుకోలేదని ఎంహోఫ్ చెప్పారు. వివాహేతర సంబంధాన్ని దాచి తన మొదటి భార్యను మోసగించానని డగ్లస్ ఎంహోఫ్ వెల్లడించినట్లు సదరు బ్రిటీష్ టాబ్లాయిడ్ పేర్కొంది. ఈ వివాహేతర సంబంధం బయటపడే మొదటి పెళ్లి పెటాకులైనట్లు సదరు మీడియా తెలిపింది. తాను చేసిన పనుల వల్ల కెర్స్టిన్, తాను గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఇందుకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు సీఎన్ఎన్తో ఎంహోఫ్ చెప్పారు.

ALSO READ | సెప్టెంబర్ 4న ట్రంప్, హారిస్ డిబేట్

మొదటి పెళ్లి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా నడిపిన వివాహేతర సంబంధం గురించి కమలా హారిస్కు కూడా ఎంహోఫ్ చెప్పినట్లు తెలిసింది. ఎంహోఫ్ వివాహేతర సంబంధం గురించి మాజీ భార్య కెర్స్టిన్ను మీడియా అడగ్గా ఆవిడ ఒకటే చెప్పారు. డగ్, తాను పలు కారణాల వల్ల కొన్నేళ్ల క్రితం తమ వివాహ బంధానికి ముగింపు పలికామని తెలిపారు. తన పిల్లలకు గ్రేట్ ఫాదర్ అని, తనకు ఒక మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. అంతేతప్ప.. ఆయన వివాహేతర సంబంధం గురించి తెలియడంతోనే విడిపోయినట్లు ఆమె నిర్ధారించకపోవడం గమనార్హం. 

ఇక.. హారిస్తో డేటింగ్ చేసేటప్పటికే ఆ టీచర్తో వివాహేతర సంబంధానికి డగ్లస్ ఎంహోఫ్ ముగింపు పలికారు. 2009లో డగ్లస్ ఎంహోఫ్ మొదటి భార్యతో తెగతెంపులు చేసుకున్నారు. 2009లో మొదటి భార్య విడాకులు కోరింది. 2010 సంవత్సరం చివరలో విడాకులు మంజూరు కావడం గమనార్హం. 2013లో కమలా హారిస్, ఎంహోఫ్ కలుసుకున్నారు. 2014లో కమలా హారిస్ను రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయానికి ఎంహోఫ్ లాస్ ఏంజెల్స్లో ఎంటర్టైన్మెంట్ లాయర్ కాగా, కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా తలపడుతున్నారు.