రాజకీయ మేధావి ‘లక్కీ హారిస్’

రాజకీయ మేధావి ‘లక్కీ హారిస్’

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న రాజకీయ మేధావి కమలా హారీస్​ చురుకైన రాజకీయవేత్తే  కాకుండా అదృష్టవంతురాలు కూడా అనిపిస్తోంది. సుదూర ప్రాంతాల్లో ఉరుములు తమను ప్రభావితం చేయవని ప్రజలు సాధారణంగా భావిస్తారు. కానీ, ఆ తుపాను ఎప్పుడు మీ దారికి వస్తుందో మీకు తెలియదు.  సుదూర అమెరికాలో జరుగుతున్న సంఘటనలు భారతదేశంపై పెద్ద పరిణామాలను చూపనున్నాయి.  ఎందుకంటే  భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ వ్యవహారాలపై అమెరికా చాలా ప్రభావం చూపుతున్నది.  జులై 21న తాను రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనని ప్రస్తుత ప్రెసిడెంట్​ జో బైడెన్ చెప్పడంతో అమెరికాలో  రాజకీయ సునామీ ఏర్పడింది. 

కమలా హారిస్‌‌ను డెమొక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉద్దేశపూర్వకంగా ప్రమోట్ చేసిన అమెరికన్ రాజకీయ నాయకుల్లో కొందరు కీలక నాయకులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్, అదేవిధంగా మరో మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్ తదితరులు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమలా హారిస్‌‌ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా చేయడంలో వారందరి పాత్ర కూడా ఉంది.  

ప్రపంచంలోని ప్రతిచోట రాజవంశాలు,  కుటుంబాలు పెద్ద పాత్ర పోషిస్తున్న తరహాలోనే అమెరికాలోనూ డైనాస్టీలు ప్రధానంగా వ్యవహరిస్తాయి. కాగా, ముఖ్యమైన ఆరుగురు అమెరికన్ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు తమ సొంత ఎజెండాను కలిగి ఉన్నారు. కానీ,  చివరికివారు ఏకీభవించడం కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ నామినేషన్‌‌ను పొందేలా చేసింది. అమెరికా అధ్యక్షురాలిగా కూడా మారవచ్చు. ఈ వ్యక్తులందరి చరిష్మాలో కమలా హారిస్ వెనుకబడి ఉన్నారు. అయితే,  ఇతర చర్యలు కమలా హారిస్‌‌ను ముందువరుసలో నిలబెట్టాయి.
 

ఒబామాకు బైడెన్ షాక్

భారతీయులు చెప్పినట్లు.. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక మీకు ఎదురేముంటుంది., మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించగలరు?   కమలా హారిస్ తన బాస్, యూఎస్​ ప్రెసిడెంట్ జో బైడెన్​కు తనపట్ల వ్యతిరేక భావన లేకుండా,  ఆందోళన చెందకుండా చాకచాక్యంగా పరిణతితో  వ్యవహరించింది. జులై 21, 2024 వరకు తాను పోటీ చేయనని జో బైడెన్ చెప్పేవరకు  కమలా హారిస్  రాజకీయంగా క్రియాశీలకంగా దూకుడు ప్రదర్శించలేదు. ఈ వ్యూహం  కమలా హారిస్  ఒడిలో బంగారు బుట్ట  పడేలా చేసింది.  కాగా, అధ్యక్షుడు బైడెన్​ అనారోగ్యంతో ఉన్నారు. కానీ, ఆయన మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నారు. 

అయితే సొంత పార్టీ ఆయనకు వ్యతిరేకంగా ఉంది. మరోవైపు  తన భార్య మిచెల్ ఒబామా డెమొక్రటిక్ అభ్యర్థి కావాలని కోరుకున్నందున, పార్టీలో బరాక్ ఒబామా రహస్యంగా తనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించారని బైడెన్‌‌కు తెలుసు. దీంతో బైడెన్​ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే కాకుండా వెంటనే కమలా హారిస్‌‌కు మద్దతు ఇవ్వడం ద్వారా బరాక్ ఒబామాకు షాక్ ఇచ్చాడు, తద్వారా మిచెల్ ఒబామా అభ్యర్థిగా మారకుండా బైడెన్ అడ్డుకున్నాడు. అంటే.. ఒబామా ప్లాన్​లు విఫలమయ్యాయని దీని అర్థం.

అనూహ్యంగా రేసులోకి...

బరాక్ ఒబామా 2021 నుంచి జో బైడెన్ రెండోసారి పోటీ చేయకూడదని, తన భార్య మిచెల్‌‌ ఒబామాకు మార్గం కల్పించాలని భావించారు. కానీ,  బైడెన్ దీనికి అంగీకరించలేదు.  అందువల్ల ఒబామా నిశ్శబ్దంగా బైడెన్ పోటీ చేయకుండా పరోక్షంగా ప్రణాళికాబద్ధంగా వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు.  బైడెన్​ చాలా అనారోగ్యంతో ఉన్నాడని పార్టీలో చేపట్టిన నిశ్శబ్ద ప్రచారాన్ని మెజార్టీ సభ్యులు అంగీకరించారు. 

దీంతో  మరోసారి బైడెన్​ అధ్యక్షుగా పోటీచేయకుండా ఆయనను దించేయడంలో ఒబామా విజయం సాధించాడు. అయితే ఆయన ఊహించనివిధంగా అనూహ్యంగా కమలా హారిస్ రేసులోకి దూసుకువచ్చింది. దీంతో నిరాశకు గురైన బరాక్​ ఒబమా, మిచెల్​ ఒబామా చాలారోజులు కమలా హారిస్​ మద్దతు ప్రకటించలేదు. కానీ, ఆమె డెమొక్రటిక్​ అభ్యర్థిగా ఖరారు అవడంతో ఒబామాలు మద్దతు ఇవ్వక తప్పలేదు. 

చాణక్యురాలు కమలా హారిస్​

డెమొక్రటిక్ పార్టీలో కుట్రలు జరిగాయి. కమలా హారిస్ నాన్-సీరియస్ వ్యక్తి అని, ఆమె  వైస్ ప్రెసిడెంట్​గా విఫలమయ్యారని విమర్శించినా.. చివరకు అధ్యక్ష ఎన్నికల్లో  డెమొక్రటిక్​ అభ్యర్థిగా పోటీచేయడంలో ఆమె విజేతగా నిలిచారు.  భగవద్గీతలో ‘క్రియారహితంలో చర్య’ అని చెప్పే గొప్ప శ్లోకం ఉంది.  అంటే.. యాక్షన్​ ఇన్..​ ఇన్​యాక్షన్​లో  మీరు నిష్క్రియంగా కనిపిస్తుంటారు. కానీ, మీరు యాక్టివ్‌‌గా ఉంటారు.  కమలా హారిస్ నిష్క్రియంగా కనిపిస్తూనే  ఈ అసూయ, పోరాటాలను ప్రోత్సహించింది. కానీ  వాటి నుంచి ఆమె మాత్రం దూరంగా ఉంది. 

దీంతో అందరూ  కమలా హారిస్​  సాధారణ వ్యక్తి  అనుకున్నారు.  కమల ఒక అసాధారణ, తెలివైన రాజకీయవేత్త అని ఎన్నో సంఘటనలు నిరూపిస్తున్నాయి. గొప్ప ఫ్రెంచ్ యోధుడు నెపోలియన్. తన సైన్యాలకు ఎలాంటి జనరల్స్ కావాలని 220 సంవత్సరాల క్రితం అడిగినప్పుడు.. నెపోలియన్ ‘లక్కీ జనరల్స్’ అన్నాడు. కమలా హారిస్‌‌కు అన్ని అదృష్టాలు ఉన్నాయి. జో బైడెన్, ఒబామా, క్లింటన్ రహస్యంగా పరస్పర శత్రువులు. అయినప్పటికీ, కమలా హారిస్‌‌ను ప్రెసిడెంట్​ అభ్యర్థిగా చేయడంలో వారందరూ సహకరించక తప్పలేదు. ఎవరితో స్నేహం చేయాలో,  ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా కమలా హారిస్‌‌కు బాగా తెలుసు. 

భారత్​ పట్ల కమల వైఖరి?

భారతదేశం నుంచి కమల  వ్యూహాత్మకంగా దూరంగా ఉంది. కమలా హారిస్ తన భారతీయ వారసత్వాన్ని వదులుకోలేదు. కానీ, సెనేటర్,  వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె భారతదేశాన్ని ఎప్పుడూ సందర్శించకుండా చాలా తెలివిగా వ్యవహరించింది. ఎందుకంటే ఆమె భారతీయ సంతతి కంటే అమెరికన్- నల్లజాతీయురాలిగా పేరు పొందాలనుకుంటోంది. కమలా చాలా ఉద్వేగభరితంగా, ప్రతిష్టాత్మకంగా ఉన్నందున భారతదేశంతో సంబంధాలను జాగ్రత్తగా తప్పించుకుంటుంది. బిల్ క్లింటన్, బరాక్ ఒబామా అధ్యక్షులైనప్పుడు చాలా అంచనాలు ఉన్నాయి. 

కానీ, క్లింటన్, ఒబామా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్,  చైనాలను ప్రోత్సహించడం ద్వారా తమ శక్తిమేరకు భారతదేశాన్ని దెబ్బతీశారు. అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌‌ భారత్‌‌కు నష్టం కొనసాగించారు. కమలా హారిస్​ కూడా అధ్యక్షురాలు కావొచ్చు. కానీ, కమలా హారిస్ నుంచి ఎలాంటి సహాయాలు ఆశించలేం.

ట్రంప్​కు షాక్​

బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటే డెమొక్రటిక్ పార్టీలో గందరగోళం నెలకొంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో తప్పుకున్నా..ఇప్పుడు ట్రంప్ మరింత శక్తిమంతమైన అభ్యర్థి కమలా హారిస్‌‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో డొనాల్డ్​ ట్రంప్ చాలా షాక్ అయ్యారు.  బిల్ క్లింటన్​ ఆయన భార్య హిల్లరీ క్లింటన్.. భారత్​ రాజకీయ నాయకులందరిలాగే తాముకూడా జీవితాంతం అధికారంలో ఉండాలని కోరుకుంటారు.

 కానీ, 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోయి అవమానకరమైన స్థితిలో ఉన్నారు. అయితే, వారి పెద్ద శత్రువు ఒబామా. అందుకేవారు మిచెల్ అభ్యర్థిగా మారకుండా అడ్డుకోవాలనుకున్నారు. కమలా హారిస్​కి సపోర్ట్ చేసి ఒబామాలను నిలువరించిన క్లింటన్​ దంపతులు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆనందాన్ని తీసుకురావడానికి అసూయ కూడా ఒక గొప్ప మార్గం అనడానికి ఇది నిదర్శనం. 

ఇతరుల వైఫల్యాలే కమలా హారిస్​ సక్సెస్

కమలా హారిస్‌‌కు ఎలాంటి ఫ్యాక్షన్‌‌,ఎక్స్​పీరియన్స్ లేదు. కానీ,  ఆమె సెనేటర్ అయ్యారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్,  ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడుతున్నారు.  కమల ఆయుధాలు.. ఇన్-యాక్టివిటీ, నిశ్శబ్దం, నాన్​ సీరియస్‌‌నెస్.   ప్రెసిడెంట్  గా పోటీ చేసే క్రమంలో కమలా హారిస్​ గత 4 సంవత్సరాలలో  అధ్యక్ష పదవిపై ఎటువంటి ఆసక్తిని ప్రదర్శించలేదు. ప్రత్యక్షంగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఆ వ్యూహం ఫలించి ఆమెకు మార్గం నల్లేరుపై నడకలా మారింది.  ఇతరుల వైఫల్యాలు కమలా హారిస్​ సక్సెస్​కు దారితీశాయి.  

 డా. పెంటపాటి పుల్లారావు,

పొలిటికల్ ఎనలిస్ట్​