వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హ్యారిస్ స్పందించారు. అల్మా మేటర్ హోవార్డ్ విశ్వవిద్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని అన్నారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించడమే ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక సూత్రమని పేర్కొన్నారు. ఓడినంతా మాత్రాన కుంగిపోయేది లేదని.. మహిళల హక్కుల కోసం, అమెరికాలో తుపాకీ హింసకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
అమెరికా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో తమ పోరాటాలను వదులుకోవద్దని హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఈ ఫలితం మనం ఊహించింది కాదు.. దీనితో ఎవరూ నిరాశ చెందకండని ఓటమి బాధలో ఉన్న పార్టీ కార్యకర్తలకు కమలా హ్యారిస్ ధైర్యం చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపానని కమలా చెప్పారు. శాంతియుత అధికార మార్పిడికి సహకరిస్తామని.. మేము యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి విధేయత చూపుతామని పేర్కొన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిని కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.