- గతంలో ఐదారు వేలు దాటని పార్టీకి ప్రస్తుతం 30 వేలకుపైగా ఓట్లు
- బీజేపీ భారీగా ఓట్లు చీల్చడంతో బోల్తా కొట్టిన బీఆర్‌ఎస్
- ఉత్కంఠ పోరులో విజయాన్నందుకున్న కాంగ్రెస్
హనుమకొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ బీఆర్‌ఎస్‌కు కోలుకోలేని నష్టం కలిగించింది. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ కొంత స్ట్రాంగ్ అవగా, త్రిముఖ పోటీ నడిచిన పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపి బీఆర్‌ఎస్ గెలుపు అవకాశాలకు గండికొట్టింది. గతంలో ఐదారు వేల ఓట్లు కూడా రాని పార్టీకి ప్రస్తుతం 30 వేలకు పైగా ఓట్లు రావడంతో బీఆర్‌ఎస్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గెలిచే అవకాశం ఉన్నచోట కూడా కారు బోల్తా కొట్టింది.
కొండా సురేఖకు గట్టి పోటీ
వరంగల్ తూర్పులో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు నుంచే పార్టీ గ్రాఫ్బాగా పెరిగిపోయింది. ఇక్కడ 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి కుసుమ సతీశ్ పోటీచేయగా ఆయనకు 4,729 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ క్యాండిడేట్ వద్దిరాజు రవిచంద్ర మొదటి, రెండు స్థానాల్లో నిలువగా, బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది.
అయితే ఈ సారి తూర్పులో విజయం సాధించిన కాంగ్రెస్ క్యాండిడేట్ కొండా సురేఖకు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గట్టి పోటీ ఇచ్చారు. కొండా సురేఖ 67,757 ఓట్లు సాధించగా ప్రదీప్‌రావు ఏకంగా 52,105 ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న నన్నపనేని నరేందర్ 42,783 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. బీజేపీకి పడిన ఓట్లలో సగం బీఆర్‌ఎస్‌కు పడినా, బీఆర్‌ఎస్ ఓట్లు చీలి బీజేపీకి పడినా తూర్పులో ఫలితం తారుమారయ్యేది.
పరకాలలో...
పరకాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీ తరఫున డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి పోటీ చేయగా 2,483 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈ సారి బీసీ నినాదంతో వచ్చిన బీజేపీ పరకాలలో డాక్ట్‌ర కాళీప్రసాద్‌రావుకు టికెట్ ఇచ్చింది. ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉండడంతో పాటు బీసీ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని పార్టీ భావించింది.
ఈ ఈక్వేషన్‌లో డాక్టర్ కాళీప్రసాద్‌కు 38,735 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి 72,573 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ క్యాండిడేట్ చల్లా ధర్మారెడ్డికి 64,632 ఓట్లు పడ్డాయి. 7,941 ఓట్ల మెజారిటీతో ప్రకాశ్‌రెడ్డి గెలిచారు. నియోజకవర్గంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోగా కాళీప్రసాద్‌రావుకు పడిన ఓట్లు బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారాయి.
దీనివల్లే మొదటి నుంచీ గెలుపు ధీమాతో ఉన్న చల్లా ధర్మారెడ్డి బీజేపీ చీల్చిన ఓట్ల కారణంగా విజయానికి దూరం అయ్యారు. ఇలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడిచిన నియోజకవర్గాల్లో కారు చతికిలపడింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అనుకున్న స్థానాల్లో బీజేపీ గేమ్ ఛేంజర్‌గా మారి వరుస విజయాలపై కన్నేసిన కారు పార్టీ ఎమ్మెల్యేలను ఇంటి బాట పట్టించింది.
వినయ్ భాస్కర్‌కు షాక్
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్‌గా మార్తినేని ధర్మారావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,42,664 ఓట్లు పోలవగా, ధర్మారావుకు 5,979 మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతృత్వంలో పార్టీ పుంజుకుంది. ప్రభుత్వ తీరుపై నిరసనలు, ధర్నాలు చేపట్టి అట్టడుగున ఉన్న పార్టీకి గుర్తింపు తీసుకొచ్చారు.
దీంతో ఈ సారి బీజేపీ నుంచి పోటీకి దిగిన రావు పద్మకు 30,826 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డికి 72,649 ఓట్లు రాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ 57,318 ఓట్లు సాధించి 15,331 తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకవేళ బీజేపీ గతంలో లాగానే ఐదారు వేలకే పరిమితమై ఉంటే మిగతా ఓట్లలో చాలా వరకు బీఆర్‌ఎస్‌కు పడేవి. అదే జరిగితే నియోజకవర్గంలో ఫలితం మరోలా ఉండేది. బీజేపీ ఓట్లు చీల్చడమే వినయ్ భాస్కర్ ఓటమికి ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.