కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి చిక్కారు. తండ్రి నుంచి కొడుకుకు భూమి రిజిస్ట్రేషన్ చేసేం దుకు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య కథనం ప్రకారం..కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన కాసరబోయిన గోపాల్ తన తండ్రి నుంచి మూడెకరాల రెండు గంటల భూమిని తన పేరు మీదకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 9న మీ సేవలో రూ.4,830 చలానా కట్టి దరఖాస్తు చేసుకున్నాడు. 10వ తేదీన శ్లాట్బుక్ చేసుకుని తహసీల్దార్ మాధవి దగ్గరకు వెళ్లగా.. ఆమె ఆ ఫైల్ కనీసం చూడలేదు.
18న మరోసారి ఆమెను సంప్రదించగా, భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే ధరణి ఆపరేటర్ రాకేశ్‌కు రూ.వెయ్యి, తనకు రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. డబ్బులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్ చేసేది లేదని స్పష్టం చేయడంతో బాధితుడు గోపాల్వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు రూ.5 వేలు తీసుకుని సోమవారం తహసీల్దార్ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ తహసీల్దార్మాధవి..ధరణి ఆపరేటర్ రాకేశ్‌కు ఇవ్వాలని చెప్పింది.
ఆమె చెప్పినట్టే డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. తహసీల్దారే డబ్బులు తీసుకోమన్నారని చెప్పడంతో మాధవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వరంగల్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య వివరించారు. తహసీల్దార్ మాధవి గతంలో భూపాలపల్లిలో పని చేసినప్పుడు కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు లేదా 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారమివ్వాలని డీఎస్పీ సాంబయ్య సూచించారు.
సిరిసిల్లలో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ కాంట్రాక్టర్దగ్గర రూ.ఏడు వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్ఏసీబీకి చిక్కాడు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్రూ. 4.50 లక్షలతో శ్మశానవాటిక కంపౌండ్ వాల్ నిర్మించాడు. వీటి బిల్లులు ఇవ్వడానికి పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు నాలుగు నెలలుగా తిప్పించుకుంటున్నాడు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు ఫైల్పంపించాలంటే రూ.8 వేలు లంచం కావాలనడంతో వెంకటేశ్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం భాస్కర్‌రావుకు రూ.7 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.
శంషాబాద్‌లో దొరికిన పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని నానాజీపూర్‌లో ఓ ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం డిమాండ్‌చేసిన పంచాయతీ కార్యదర్శి, బిల్కలెక్టర్ఏసీబీకి చిక్కారు. బర్కత్ అలీ అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి పంచాయతీ కార్యదర్శి రాధికరెడ్డి, బిల్ కలెక్టర్ బాలరాజు రూ.50 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ. 35వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వారి సూచన మేరకు సోమవారం రూ. 35వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.