కమలాపురం పంప్​హౌస్​లో ట్రయల్​ రన్​ సక్సెస్

కమలాపురం పంప్​హౌస్​లో ట్రయల్​ రన్​ సక్సెస్
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • రోళ్లపాడు, బయ్యారానికి గోదావరి నీళ్లు ఇచ్చేందుకు కృషి   
  • సీతారామ ప్రాజెక్ట్​ పూర్తికి ముఖ్యమంత్రిని రూ.10వేల కోట్లు అడుగుతామన్న మినిస్టర్​
  • పూసుగూడెంలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన 

భద్రాద్రికొత్తగూడెం/ముల్కలపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టులో కీలకమైన కమలాపురంలోని మూడో పంప్​హౌస్​ ట్రయల్​రన్ ​సక్సెస్ అయిందని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సీతారామ ప్రాజెక్ట్​ ఎత్తిపోతల పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెంలోని రెండో పంప్​హౌస్​వద్ద సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ ​వి పాటిల్, ఇరిగేషన్ ఆఫీసర్లు, ఎస్పీ బి. రోహిత్ రాజుతో కలిసి ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురంలోని పంప్ హౌస్​లను మంత్రి సందర్శించారు.

కమలాపురంలోని మూడో పంప్​హౌస్​లో ట్రయల్​రన్​ నిర్వహించారు. పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తర్వాత మంత్రి విలేకరులతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. దీంతోపాటు రూ.2లక్షల రుణమాఫీతో తన జీవితం ధన్యమైందన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సింగభూపాలం, మూకమామిడి, వైరా ప్రాజెక్ట్, లంకా సాగర్​ చెరువులను నింపనున్నట్టు తెలిపారు.

యాతాలకుంట, జూలూరుపాడు టన్నెల్స్​తో పాటు మెయిన్ ​డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ను పూర్తి చేయాల్సి ఉందన్నారు. వచ్చే రెండేండ్లలో సీతారామ ప్రాజెక్ట్​ను కంప్లీట్ ​చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తొందన్నారు. సీతారామ ప్రాజెక్ట్​కు సంబంధించి ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద కేసీఆర్​ శంకుస్థాపన చేసి దాన్ని గాలికి  వదిలేశాడన్నారు. గోదావరి నీళ్లను రోళ్లపాడుతో పాటు బయ్యారానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేందుకే సీఎం రేవంత్​రెడ్డిని తీసుకువస్తున్నామని తెలిపారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన మరో రూ.10వేల కోట్లను సీఎంతో పాటు ఇరిగేషన్​మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డిని అడుగనున్నట్టు తెలిపారు. సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ను పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు గోదావరి జలాలను తీసుకెళ్లవచ్చన్నారు. యాతాలకుంట టన్నెల్​ను పూర్తి చేస్తే సత్తుపల్లి ప్రాంతంలో దాదాపు 2లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు ఇవ్వొచ్చన్నారు. జూలూరుపాడు టన్నెల్​పూర్తి చేసి పాలేరుకు నీళ్లు ఇస్తామన్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ, ఫారెస్ట్​ పర్మిషన్స్​తీసుకురావాల్సి ఉందన్నారు.

కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంగా మారనున్న వైరా ప్రాంతంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ మూడో విడతను సీఎం గురువారం ప్రారంభించనున్నారని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇరిగేషన్​ అడ్వయిజర్​ పెంటారెడ్డి, డీఆర్​డీఓ విద్యాచందన, ఇరిగేషన్​ఆఫీసర్లు పాల్గొన్నారు.