భోపాల్: 77 ఏండ్ల వయసు.. బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.. ఎలాగైనా గెలవాలని.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ అనుకున్నవేవీ జరగలేదు. ‘కమలనాథుల’ చేతిలో కమల్‌నాథ్ ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి బీజేపీనే గెలిచింది. దీంతో కమల్‌నాథ్ రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్లేనని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
సుదీర్ఘ అనుభవం.. గాంధీ ఫ్యామిలీకి విధేయుడు
1980 లలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కమల్‌నాథ్. తొలిసారి ఛింద్వారా పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. 1996 దాకా వరుసగా నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తిరిగి 1999 నుంచి 2014 దాకా వరుసగా మరో ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గాంధీ ఫ్యామిలీకి విధేయుడని ఈయనకు పేరు ఉంది. 2018లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. 2018 డిసెంబర్ 13న రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఛింద్వారా నుంచి మరోసారి గెలిచినా.. పార్టీ మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 60 స్థానాలకే పరిమితమైంది. దీంతో సీఎం కావాలని, పూర్తి టర్మ్ పవర్‌లో కొనసాగాలన్న ఆయన ఆశలకు గండిపడింది.
పని చేయని ప్రచారం..
తన ప్రభుత్వాన్ని మోసంతో కుప్పకూల్చారని, జ్యోతిరాదిత్య సింధియా వెన్నుపోటు పొడిచారని ఎన్నికల ప్రచారంలో కమల్‌నాథ్ మండిపడ్డారు. ఏం తప్పు చేశానని తన ప్రభుత్వాన్ని కూల్చివేశారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన వారిని ఓటుతో శిక్షించాలని పిలుపునిచ్చారు. కానీ ఓటర్లు బీజేపీకే పట్టం కట్టారు. బీజేపీకి ఏకపక్షంగా మెజారిటీ కట్టబెట్టారు.
వెరిసి కమల్‌నాథ్ రాజకీయ జీవితాన్ని ముగిస్తారా? ఇప్పటికే పాలిటిక్స్‌లో ఉన్న తన కొడుకును పూర్తిగా తెరపైకి తీసుకొస్తారా? లేక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
15 నెలలకే పడగొట్టిన్రు
2018 ఎన్నికల్లో 114 సీట్లు సాధించి లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 116 కాగా.. అందుకు 2 సీట్ల దూరంలో కాంగ్రెస్ నిలిచింది. బీజేపీ 109 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీ, స్వంతంత్రుల సాయంతో 2018 డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని కమల్‌నాథ్ ఏర్పాటు చేశారు. కానీ 15 నెలల్లోనే సర్కారు కుప్పకూలింది. సింధియా తన వర్గంతోపాటు వెళ్లి బీజేపీలో చేరడంతో.. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రిజైన్ చేశారు.