భోపాల్: భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ప్రస్తుతం రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండగా.. షెడ్యూల్ కఠినంగా రూపొందించడంపై కమల్ నాథ్ అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రతో చచ్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదీప్ మిశ్రా అనే పండితుడితో ఆయన మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘గత ఏడు రోజులుగా మేం సచ్చిపోతున్నం.. ఇక్కడ రెండే నిబంధనలు ఉన్నాయి. ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభించాలి. రోజులో కనీసం 24 కిలోమీటర్లు నడవాలి. అంతేకాకుండా మధ్యప్రదేశ్ లో యాత్రకు రాహుల్ ముందే మూడు కండీషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భీల్ జన్మస్థలం, ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహంకాళి ఆలయాలను సందర్శించాలని షరతు పెట్టారు” అని కమల్ నాథ్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇటీవల పాదయాత్రలో దిగ్విజయ్ సింగ్ జారిపడిన నేపథ్యంలో కమల్ నాథ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. కాగా, యాత్రలో రాహుల్ వెంటే కమల్ నాథ్ ఉంటున్నారు. ఆయనతో కలిసి ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహంకాళి ఆలయాలను సందర్శించారు.
యాత్రలో పాల్గొన్న స్వరా భాస్కర్
భోపాల్: యాక్టర్ స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆమె గురువారం ఉజ్జయినిలో రాహుల్ తో కలిసి పాదయాత్ర చేశారు. ‘‘భారత్ జోడో యాత్రలో పాల్గొనండి.. మన దేశం కోసం నిలబడండి” అని స్వరా భాస్కర్ పిలుపునిచ్చారు. కాగా, భారత్ జోడో మొబైల్ లైబ్రరీని రాహుల్ ప్రారంభించారు. యాత్రలో పాల్గొనేవాళ్లు ఫ్రీ టైమ్ లో చదువుకునేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశామని మహిళా కాంగ్రెస్ లీడర్ అవని బన్సాల్ తెలిపారు. ట్రక్కులో వెయ్యి బుక్స్ అందుబాటులో ఉంచామని, ఇందులో పొలిటికల్, ఫేమస్ లీడర్ల బుక్స్ ఉన్నాయన్నారు. యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటివి 500 మొబైల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.