కొత్తకోట, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్ సర్కారు దవాఖానలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సర్కారు వైద్యంపై నమ్మకం లేక పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న తరుణంలో వనపర్తి జిల్లా కమాలోద్దీన్‌పూర్ మెడికల్ ఆఫీసర్ సౌజన్య లత పక్క మండలంలోని పీహెచ్సీలో డెలివరీ చేయించుకొని ఆదర్శంగా నిలిచారు. సోమవారం డాక్టర్ సౌజన్య లతకు పురిటి నొప్పులు రావడంతో కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డెలివరీకి వచ్చిన డాక్టర్‌కు కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు.
విషయం తెలుసుకున్న డీఎంహెచ్ వో జయచంద్ర హాస్పిటల్కుచేరుకొని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు గర్భిణులకు ఇబ్బంది కలగకుండా నార్మల్ డెలివరీ చేస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తూడబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. డెలివరీ కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా, సర్కారు దవాఖానలకు రావాలని విజ్ఞప్తి చేశారు.