కామారెడ్డి, నిజామాబాద్ ​కలెక్టరేట్లను ముట్టడించిన టీచర్లు, ఆయాలు

  • అంగన్​వాడీలను తొలగించే కుట్ర
  • కామారెడ్డి, నిజామాబాద్ ​కలెక్టరేట్లను ముట్టడించిన టీచర్లు, ఆయాలు
  •  కామారెడ్డి కలెక్టరేట్ లోకి  వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు


కామారెడ్డి, వెలుగు:  అంగన్​వాడీ ఎంప్లాయీస్​ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ  శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్,  కామారెడ్డి  కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్​ రోడ్డులో  మీటింగ్​ నిర్వహించిన అనంతరం ర్యాలీగా టీచర్లు, ఆయాలు కలెక్టరేట్​కు వెళ్లారు.  కలెక్టరేట్​లోపలికు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. భారీకేడ్లను దాటుకుని వెళ్లేందుకు యత్నించినా పోలీసులు  వెళ్లనివ్వలేదు. దీంతో    అక్కడే  బైఠాయించి  ధర్నా చేశారు.  ఈ సందర్భంగా వారు ఐసీడీఎస్​కు  బడ్జెట్ ​పెంచాలని, గ్రాట్యుటీ  చెల్లించాలని, టీచర్లతో సమానంగా అంగన్​వాడీ  ఎంప్లాయీస్​కు జీతాలు,  ఇతర  అలవెన్స్​లు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నినదించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ, అంగన్​వాడీ యూనియన్ ​లీడర్లు కలెక్టర్ జితేశ్​వి  పాటిల్​కు వినతి పత్రం అందజేశారు.  సీఐటీయూ జిల్లా కన్వీనర్​ కె. చంద్రశేఖర్​,  ప్రతినిధులు రవీందర్, సురేశ్​, కల్పన,  యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.   వీరి ఆందోళనకు కాంగ్రెస్​ పార్టీ మద్దతు 
తెలిపింది.

 ఐసీడీఎస్​ను  నిర్వీర్యం చేసే  కుట్ర


 నేషనల్​న్యూ ఎడ్యుకేషన్​ పాలసీతో ఐసీడీఎస్​ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర  జరుగుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ  ఆరోపించారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట అంగన్​వాడీ  ఎంప్లాయీస్​ఆందోళనకు  మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అంగన్​వాడీ ఎంప్లాయీస్​ఉపాధికి నష్టం కలిగించే  చర్యలు చేపడుతోందని, ఈ నిర్ణయాలను రాష్ర్ట  ప్రభుత్వం  వ్యతిరేకించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.  గతంలో ఆందోళన చేసిన అంగన్​వాడీ టీచర్లను స్వయంగా సీఎం ప్రగతి భవన్​కు పిలిపించి మాయ మాటలు చెప్పి పంపి, మరుసటి రోజే వాటిని మరచిపోయారన్నారు. అంగన్​వాడీ తరఫున కాంగ్రెస్​పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,   జడ్పీ ప్లోర్​ లీడర్ మోహన్​రెడ్డి,  లీడర్లు ఆనంద్​రావు, భీమ్​రెడ్డి,  గోనె శ్రీనివాస్​, ఐరేని సందీప్ పాల్గొన్నారు.  ‌‌‌