కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 5810 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలంగాణలో ఉత్కంఠ రేపిన కామారెడ్డి నియోజకవర్గం ఫలితం వెలువడింది.
కామారెడ్డి నియోజకవర్గంలో సంచలన ఫలితం వచ్చింది. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్, రేవంత్ రెడ్డిలలో ఎవరో ఒకరు గెలుస్తారని భావించారు. కానీ అనూహ్యంగా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి గెలుపొంది సంచలనానికి తెరతీశారు. ఉత్కంఠభరితంగా సాగిన కామారెడ్డి పోరులో చివరకు బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. సమీప ప్రత్యర్ధి కేసీఆర్ పై బీజేపీ నేత రమణారెడ్డి విజయం సాధించి బీఆర్ఎస్ శ్రేణులకు భారీ షాకిచ్చారు. అయితే సీఎంతో పాటు మరో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఓడించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు బీజేపీ నేత వెంకట రమణారెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన నియోజకవర్గాల్లో కామారెడ్డి ఒకటి. సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. కేసీఆర్ ను ఎలాగైన ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నేత ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైకి పోటీకి దిగారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడిస్తానని అధిష్టానాన్ని ఒప్పించి మరీ ఈటల బరిలోకి దిగగా, కామారెడ్డి నుంచి రేవంత్.. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టారు.
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి గెలుపొంది సంచలనానికి తెరలేపారు. ఒకరేమో సీఎం కేసీఆర్, మరోవైపు కాంగ్రెస్ నుంచి సీఎం అయ్యే హోదా ఉన్న నేత.. అయినా బీజేపీ నేత రమణారెడ్డి సైలెంట్ గా తన పనిచేసుకుంటూ పోతూ వారిద్దరికీ షాకిచ్చారు.
కామారెడ్డిలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి బరిలో నిలిచారు. అనూహ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి కామారెడ్డిలో విజేతగా నిలిచారు బీజేపీ అభ్యర్థి.
కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీలు సాధించిన ఓట్ల వివరాలు
కాంగ్రెస్ : 54,296
బిజెపి : 65,198
బిఆర్ఎస్ : 59,388
5810 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ వెంకట రమణ రెడ్డి