- కేసీఆర్‌ను పొలం బాట పట్టించాం: షబ్బీర్ అలీ
- కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కామారెడ్డి బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ దెబ్బకు బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో షబ్బీర్ అలీ, ఏఐసీసీ నేషనల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేశ్ శెట్కార్ సమక్షంలో కామారెడ్డికి చెందిన పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ బీబీపేట్ మండల శాఖ మొత్తం కాంగ్రెస్‌లో చేరింది. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు.
జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పదేండ్ల తర్వాత కేసీఆర్‌ను పొలం బాట పట్టించి, రైతుల వద్దకు వెళ్లేలా చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్‌కు వర్షాకాలం, ఎండాకాలం ఎప్పుడొస్తాయో కూడా తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాలు తక్కువ పడడం వల్లే రాష్ట్రంలో నీటి సమస్యలు వస్తున్నాయని చెప్పారు. గతేడాది వర్షాకాలం సమయంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమేనని
కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని ఎలా అంటున్నారని ఆయన ప్రశ్నించారు. పార్టీలో చేరిన వారిలో డీసీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ ఏదుల్ల ఇంద్రసేనా రెడ్డి, జిల్లా డైరీ చైర్మన్ తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ బీబీపేట మండల అధ్యక్షుడు వెంకట గౌడ్, వైస్ ఎంపీపీ కె.రవీందర్ రెడ్డి, బాశెట్టి నాగేశ్వర్, పలువురు సర్పంచ్‌లు, 500 మంది ఉప సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, సుతారి రమేశ్ భూమా గౌడ్ స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.