
- టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్పై కలెక్టర్ స్పెషల్ ఫోకస్
- వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
కామారెడ్డి, వెలుగు : టెన్త్, ఇంటర్లో వంద శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి విద్యార్థులు రెగ్యులర్‌గా హాజరయ్యే లా చూడాలని వారి తల్లిదండ్రులకు సూచించారు.
ప్రభుత్వ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలను విజిట్ చేస్తూ విద్యార్థులతో మమేకమై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి మ్యాథ్స్, సైన్స్ , ఇంగ్లిష్ సబ్జెక్టులపై ప్రశ్నలు వేస్తూ విద్యార్థులతో బోర్డులపై జవాబులు రాయిస్తున్నారు. టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చదవాలనే అంశాలను తెలుపుతూ విద్యార్థుల్లో ఆసక్తిని నెలకొల్పుతున్నారు.
సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి..
సర్కారు బడులపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 12,579 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో జడ్పీ, గవర్నమెంట్ హైస్కూల్స్ 187 ఉండగా 6,910 మంది విద్యార్థులు, కేజీబీవీలు 19 ఉండగా 783 మంది, రెసిడెన్షియల్ స్కూల్స్ 36 ఉండగా 2,366 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 2,488 మంది విద్యార్థులు ఉన్నారు. అన్ని రకాల గవర్నమెంట్ విద్యా సంస్థల్లో 10,091 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.
ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని గతంలోనే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్‌లో వెనుక బడిన స్టూడెంట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీచర్లకు సూచించారు. దీంతో వేకువజాము నుంచే విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలపై ఆరా తీస్తున్నారు. ఎంఈవోలు, హెచ్ఎంలతో రివ్యూ మీటింగ్ లు నిర్వహిస్తూ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. టెన్త్ తర్వాత సంబంధించిన కోర్సులు, ఐఐఐటీల్లో ప్రవేశాలను వివరిస్తున్నారు.
ఇంటర్‌లోనూ ..
ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో కలిపి మొత్తం 18,469 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 8,743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,726 మంది ఉన్నారు. ప్రభుత్వ కళాశాలలు 19 ఉండగా, ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 2,144 మంది, ఒకేషనల్‌లో 376, ద్వితీయ సంవత్సరం జనరల్ 2,129 , ఒకేషనల్‌లో 263 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది ఫలితాలు తక్కువగా రావడంతో ఈసారి మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు
తీసుకుంటున్నారు.
జేఈఈ, నీట్ పరీక్ష కోసం ..
గవర్నమెంట్ కాలేజీల్లో ఎంపీసీ, బీపీసీ చదువుతున్న స్టూడెంట్స్ జేఈఈ, నీట్ పరీక్షలు రాసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మెటీరియల్ ఇప్పించటంతో పాటు, లెక్చరర్లతో స్పెషల్ క్లాస్‌లు చెప్పించారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్
సూచించారు.
ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో చీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
38 సెంటర్లలో 18,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని, కరెంట్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఇంటర్ నోడల్ అధికారి షేక్‌సలాం తదితరులు పాల్గొన్నారు.