రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్​​ సాంగ్వాన్​

 లింగంపేట, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్​​సాంగ్వాన్​ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం లింగంపేటలో హైకోర్టు లాయర్​ మోహిన్​ అహ్మద్​ ఖాద్రి ఫాంహౌస్​లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్​నిబందనలపై అవేర్నెస్​లేకనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్​రూట్​లో ప్రయాణించడం,సెల్​ఫోన్​ మాట్లాడుతూ డ్రైవింగ్​ చేయడం ప్రమాదకరమని తెలిపారు. మద్యం తాగి  వాహనాలు నడపొద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లాకు లింగంపేట మండలం ఆదర్శం కావాలని కోరారు.

అడిషనల్​ఎస్పీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ద్విచక్రవాహనాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాపిక్​ రూల్స్​ ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. జిల్లా ట్రాన్సుఫోర్టు అధికారి  శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో  దేశంలో ఏడాదికి 1.70లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. తెలంగాణలో ఏడాదికి 6వేల మంది మృతి చెందగా,  కామారెడ్డి జిల్లాలో 270 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.  రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగం మంది హెల్మెట్​ లేని కారణంగానే చనిపోయారని చెప్పారు. హైకోర్టు న్యాయ వాది మోహిన్​ అహ్మద్​ఖాద్రి మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్​ వినియోగాన్ని భారంగా భావించొద్దన్నారు.

అంతకుముందు ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ​ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్​ ప్రారంభించారు. 22 మంది  రక్తదానం చేయగా వారికి ప్రశంసా పత్రాలు, హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్​రెడ్​క్రాప్​ సొసైటీ రాష్ట్ర కమిటీ మెంబర్​సంజీవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజన్న, డీఆర్డీవో పీడీ సురేందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్​నాయక్, తహసీల్దార్​ నరేందర్​గౌడ్, ఎంపీ డీవో నరేశ్, పీహెచ్​సీ వైద్యురాలు హిమబిందు, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, సదాశివనగర్ మండలాల ఎస్సైలు సుధాకర్, మహేశ్, మల్లారెడ్డి, రంజిత్, ​రెడ్​క్రాస్​ సొసైటీ నాయకులు రవిగౌడ్, ఎల్లమయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు