ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్య పెంచాలి : కలెక్టర్​ జితేశ్ వీ పాటిల్​

కామారెడ్డి టౌన్, వెలుగు :  వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల సంఖ్య పెంచాలని కామారెడ్డి కలెక్టర్​జితేశ్​ వీ పాటిల్​ ఆర్టీసీ ఆఫీసర్లకు సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్​ను ఆయన పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. గతంలో లక్షా 20 వేల మంది ప్రయాణించేవారని ఈ  నెల 9 నుంచి ఈ సంఖ్య 2 లక్షలకు చేరిందన్నారు. మహిళా ప్రయాణికుల ఆక్యూపెన్సీ 63 శాతంపెరిగినట్లు చెప్పారు. 

బస్సుల్లో రద్దీ దృష్ట్యా డ్రైవర్లు, కండక్టర్లు ఒత్తిడికి గురికాకుండా కోఆర్డినేషన్​తో పని చేయాలన్నారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ప్లాట్​ఫామ్​లను క్లీన్​గా ఉంచాలని, తాగునీటి వసతి, టాయిలెట్స్​సౌకర్యం కల్పించాలన్నారు. ఎక్స్​ప్రెస్​బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కలెక్టర్​ను కోరారు. ఈ  నెల 9 నుంచి 19 వరకు కామారెడ్డి డిపో నుంచి 6,82,887 మంది ప్రయాణిస్తే ఇందులో 4,29,812 మంది మహిళలు ఉన్నట్లు  డీఎం ఇందిర తెలిపారు.