కామారెడ్డి వెలుగు: సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంతో పోలీసుల పాత్ర విలువైందని కామరెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరుల త్యాగం మరువలేనిదన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం, అధికారులు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్దొత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య పాల్గొన్నారు.
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసులకు అందరం రుణపడి ఉండాలని అని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ నాగరాజు తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. దానికోసం పోలీసుల సేవలు, వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కమిషనర్ కేఆర్. నాగరాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రవి, డీసీపీలు అరవింద్ బాబు, గిరిరాజ్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాస్, సీఐ లు, ఎస్.ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.