కామారెడ్డి, వెలుగు : ఈనెల 16న జరిగే గ్రూప్- 1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో సెలక్ట్ చేస్తామన్నారు. దివ్యాంగులతో సెంటర్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్షలు రాయించాలన్నారు. అభ్యర్థులు 2 గంటల ముందే సెంటర్లకు చేరుకోవాలని చెప్పారు. ఉదయం 10.15 గంటలకు ఎగ్జామినేషన్ సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలన్నారు. పలు ఆంశాలపై అవగాహన కల్పించారు. అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
సరైన ఆహారం తీసుకోవాలి
కామారెడ్డి, వెలుగు : సరైన ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి రక్ష అని అడిషన్ కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలందరికి ప్రభుత్వం రేషన్ కార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఇస్తోందని, వాటి ద్వారా నెలనెలా కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సరిపడా బియ్యాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు. అలాగే గర్భిణుల, బాలింతల ఆరోగ్యం కోసం అంగన్వాడీ సెంటర్లు కృషి చేస్తున్నాయన్నారు. మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కోపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కవ పెట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో నాణ్యమైన భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
నందిపేట, వెలుగు: మండలంలో కోతలు మొదలయ్యాయని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గంగాధర్ కోరారు. తహసీల్దార్ ఆఫీస్‌లో శుక్రవారం ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇటీవల కురిసిన వర్షానికి నేలకొరిగిన పంటను కూడా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజలింగం, దేవన్న, రాములు
తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలె
ఆర్మూర్, వెలుగు : అక్రమ లే అవుట్లను ప్రోత్సహిస్తున్న ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ను సస్పెండ్ చేసి విచారణ చేయించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ జీవీ నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో అక్రమ లే అవుట్ల, అక్రమ నిర్మాణాలు, ఇరిగేషన్ స్థలాల ఆక్రమణలపై బీజేపీ ఆందోళనలు చేయటంతో ఉన్నతాధికారుల్లో కదలికవచ్చిందన్నారు. గతంలో ఇక్కడ పని చేసిన కమిషనర్ శైలజ ఇరిగేషన్ భూమిని ఆక్రమించి నిర్మించిన బార్ కు ఇంటి నెంబర్ కేటాయించారని, కొటార్మూర్ లో శుక్రవారం దేవి మందిరం దగ్గర మాటు కాలువ ఆక్రమించి చేసిన వెంచర్‌కు అనుమతి ఇచ్చారని, రాంనగర్ లో ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుత కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అక్రమంగా నిర్మించిన ఇండ్లకు నంబర్లు కేటాయించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ పాలెపు రాజు, మాజీ కౌన్సిలర్ ద్యాగ ఉదయ్, ఆకుల శ్రీనివాస్, ఆకుల రాజు, బ్యావత్ సాయి కుమార్, మిర్యాల్ కర్ కిరణ్ కుమార్, బట్టు రాము తదితరులు
పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు
కామారెడ్డి , వెలుగు : జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన పరుశురాంపై హత్యయత్నం చేసిన కేసులో అల్లం శివకుమార్‌కు జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జీ మూడేండ్ల జైలు శిక్ష , రూ.500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పరుశురాంపై హత్యయత్నం జరగగా కామారడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిమ్మ దామోధర్‌రెడ్డి వాధించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి
అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా
సిరికొండ, వెలుగు: మండలంలోని పందిమడుగు, పాకాల గ్రామాలకు పీఎంఏఏజీవై ( ప్రధాన మంత్రి ఆది ఆదర్శ యోజన ) పథకం ద్వారా చేస్తున్న పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. ఆయా గ్రామాల్లో పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రెండు గ్రామాల్లో రూ. 40లక్షలతో పనులు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కీరీ భాయి, భాగ్య లక్ష్మీ, ఎంపీడీవో లక్ష్మీ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
నేడు కరెంటు కట్
ఆర్మూర్, వెలుగు : మున్సిపల్ పరిధిలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని ట్రాన్స్‌కో ఏడీఈ జనార్ధన్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 132/33 కేవీ ఆర్మూర్ సబ్ స్టేషన్ లో మరమ్మతులు ఉన్నందున మూడు గంటల పాటు కరెంట్ కట్ ఉంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు.
మల్లారం ప్లాట్లను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్ టౌన్, వెలుగు: మల్లారం లో వేలం వేయనున్న స్థలాలను శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. వచ్చే నెల 14 వ తేదీన వేలం నిర్వహించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లకు డీటీసీపీ ద్వారా లే అవుట్ అనుమతి ఉండటంతో మౌలిక సదుపాయాల కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, ట్రయినేజీల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలని, నీటి వసతి, కరెంట్ సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్దీఓ రవి, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్ఐఐసి జిల్లా జనరల్ మేనేజర్ రాందాస్ ఉన్నారు.
ఒన్నాజీపేట్ లో దంత వైద్యశిబిరం
ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండలంలోని ఒన్నాజీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం దంతవైద్య శిబిరం నిర్వహించారు. మేఘన డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 400 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భగవంత్‌రెడ్డి, ప్రధానోపాద్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రన్నింగ్ పోటీల్లో హైస్కూల్ విద్యార్థికి గోల్డ్ మెడల్
బోధన్,వెలుగు: పట్టణంలోని రాకాసిపేట్ గవర్నమెంట్ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థి బామన్ రవీందర్ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు హెచ్ఎం ఆయేషా ఫాతిమా తెలిపారు. భద్రాచలంలో నిర్వహించిన క్రీడా పోటీలలో 800 మీటర్ల పరుగు పందెంలో రవీందర్ ఈ పతకం సాధించాడని, అలాగే 3000 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడని ఆమె తెలిపారు. ఈసందర్బంగా రవీందర్‌ను టీచర్లు అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఆయేషా ఫాతిమా, ఉపాధ్యాయులు నగేష్ బాబు, వెంకట్, పద్మావతి, ఈశ్వర్, సుధాకర్, పీడీ ప్రమిత పాల్గొన్నారు
స్టూడెంట్స్‌కు సన్మానం
కామారెడ్డి, వెలుగు : ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్, నీట్, ఎమ్సెట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన కామారెడ్డి సాందీపని విద్యా సంస్థల స్టూడెంట్స్‌ను శుక్రవారం కాలేజీ మెనేజ్మెంట్ ప్రతినిధులు సన్మానించారు. జేఈఈలో అశ్రిత్‌కుమార్, ప్రణతి, నీట్లో ఎం. శివాణి, ఆర్.హరితేజ, ఎమ్సెట్లో సాయిమనీషా, శ్రీలాస్య మంచి ర్యాంకులు సాధించినట్టు కాలేజీ డైరెక్టర్ హరిస్మరణ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పెంటయ్య, జనార్ధన్‌రెడ్డి, ఆశోక్‌రావు, కృష్ణమూర్తి , లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ట్రెడిషనల్ డే
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం నాలుగో రోజు ట్రెడిషనల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త, కాలేజీ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, ప్రిన్సిపల్ ఇందిరా పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.