కామారెడ్డి డిక్లరేషన్​కు, ​పాలనకు పొంతన లేదు: బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్

కామారెడ్డి డిక్లరేషన్​కు, ​పాలనకు పొంతన లేదు: బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్
ఖైరతాబాద్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్​కు, ప్రస్తుత కాంగ్రెస్​పాలనకు పొంతన లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్ విమర్శించారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే  బీసీల అభివృద్ధికి బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీల సంక్షేమానికి యేటా 20వేల కోట్ల నిధులు కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో ప్రకటించారన్నారు.
 
 ‘రాష్ట్ర బడ్జెట్​లో బీసీల వాటా -భవిష్యత్​కార్యాచరణ’ అనే అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సమావేశం నిర్వహించారు. జాజుల మాట్లాడుతూ.. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక రెండోసారి బడ్జెట్​సమావేశాలు జరగబోతున్నాయని, మొదటి బడ్జెట్​లో బీసీల సంక్షేమానికి  9,200 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. 
 
రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించి, రెండు శాతం ఖర్చు చేశారని మండిపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయలేదన్నారు. బీసీ ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణ దశలోనే ఉండిపోయాయన్నారు. 
 
రాష్ట్ర బడ్జెట్​లో బీసీల వాటాపై16న బీసీ మేధావులు, బీసీ సంఘాలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి నివేదిస్తామన్నారు. సమావేశంలో సంఘ నేతలు కుందారం గణేష్ చారి, బాలగోని బాలరాజు గౌడ్, కనకాల శ్యాంకుమార్, బి.మణిమంజరి, సింగం నగేశ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.