కామారెడ్డిలో కేసీఆర్ విజయం ఖాయం​ :కేటీఆర్

  • మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉంది
  • పంచాయితీలు పక్కనబెట్టి భారీ మెజార్టీ కోసం క్యాడర్ పనిచేయాలి
  • కామారెడ్డిలో బీఆర్ఎస్​ శ్రేణులకు మంత్రి కేటీఆర్​దిశానిర్దేశం ​

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్​పోటీచేయనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి కేటీఆర్​స్థానిక బీఆర్ఎస్ ​లీడర్లకు మార్గనిర్దేశం చేశారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ​ప్రకటించినప్పుడే ఆయన గెలుపు ఖాయమైందని, అత్యధిక మెజార్టీ సాధనే లక్ష్యంగా క్యాడర్​పనిచేయాలని సూచించారు. శనివారం స్థానిక గవర్నమెంట్​డిగ్రీ కాలేజీలో కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్​ లీడర్ల సమావేశం జరిగింది. 

చీఫ్​గెస్ట్​లుగా మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్​రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, విప్​గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ఎంకే ముజీబోద్దీన్, మున్సిపల్ చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి, స్టేట్​ఫుడ్​కమిషన్​ మాజీ చైర్మన్​ కొమ్ముల తిర్మల్​రెడ్డి, వైస్​చైర్​పర్సన్​ ఇందుప్రియ, జడ్పీ వైస్​చైర్మన్ ​ప్రేమ్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్.. ​నియోజకవర్గంతో కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ, సీఎం ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయాన్ని వివరించారు. నాటి ఉద్యమ జ్ఞాపకాలతో పాటు, మొదటి నుంచి పార్టీ వెన్నంటి ఉన్న తిర్మల్​రెడ్డి, నర్సింగ్​రావులను గుర్తు చేశారు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలను మననం చేశారు. కేసీఆర్ ​ఉద్యమాన్ని షూరు చేసిన నాటి నుంచి ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో కామారెడ్డి పోషించిన పాత్రను ఆయన గుర్తు చేశారు. 

ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే, పార్టీ శ్రేణులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతీ గ్రామానికి ఓ మేనిఫెస్టో రూపొందించాలని, మున్సిపాలిటీలో వార్డుల వారిగా ప్లానింగ్ ఉండాలన్నారు. నియోజకవర్గానికి సైతం సెఫరేట్ ​మెనిఫెస్టో రూపొందించాలని మంత్రి సూచించారు. నియోజకవర్గంలోని 266 పోలింగ్​బూత్​లకు బిగేడ్రియర్లు(ఇన్​చార్జులు)గా సీనియర్​లీడర్లను నియమించాలని చెప్పారు. లీడర్ల మధ్య పంచాయితీలుంటే పక్కన పెట్టి, పనిచేయాలని కేటీఆర్​నిర్దేశించారు. ఒకరిద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్​ను మంత్రి పరోక్షంగా ప్రస్తావించారు.

కౌన్సిలర్​తో పాటు పలువురు బీఆర్ఎస్​లో చేరిక

కామారెడ్డిలో జరిగిన మొదటి సమావేశం నుంచి పార్టీలో చేరికలపై నజర్​ పెట్టారు. బీజేపీకి చెందిన కామారెడ్డి సెకండ్​ వార్డు కౌన్సిలర్​ సుతారి రవితో పాటు, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్​లో చేరారు. వీరికి మంత్రి కేటీఆర్ ​కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

భారీ మెజార్టీ సాధించేలా పని చేద్దాం

కామారెడ్డిలో సీఎం కేసీఆర్​కు భారీ మెజార్టీ లభించేలా సమష్టిగా కృషి చేద్దామని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోందని, మరే లీడర్ సాధించని మెజార్టీని కేసీఆర్​కు కానుకగా అందిద్దామన్నారు.

అభివృద్ధి కోసమే సీఎంను పోటీ చేయాలని కోరా..

నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే స్వయంగా కోరినట్లు విప్ గంప గోవర్ధన్​పేర్కొన్నారు.  తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, కేసీఆర్​పోటీ చేస్తే జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు.