వర్కింగ్​ ఉమెన్స్​ పిల్లల కోసం క్రెష్

వర్కింగ్​ ఉమెన్స్​ పిల్లల కోసం క్రెష్
  •  కామారెడ్డిలో ఏర్పాటు కోసం సర్కారుకు నివేదిక 
  •  అంగన్​వాడీ కేంద్రాల పరిశీలన

కామారెడ్డి​​​ ​, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న మహిళ ఉద్యోగుల పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కామారెడ్డిలో క్రెష్ (శిశు సదనం) ​ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో క్రెష్​ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్​లో ఐదేండ్లలోపు వయస్సున్న వర్కింగ్​ఉమెన్​ పిల్లలను సంరక్షిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్​ ఎంప్లాయిస్​ పిల్లలను కూడా ఇక్కడ చేర్చుకుంటారు.ఆఫీసుకు వెళ్తూ పిలల్లను వదిలి.. డ్యూటీల తర్వాత తీసుకెళ్లేందుకు మహిళా ఉద్యోగులకు అనువుగా ఉండే చోట ఈ సెంటర్​ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. 

కామారెడ్డి కలెక్టరేట్​లోగానీ, దగ్గరలో ఉన్న అంగన్​వాడి సెంటర్​లో గానీ ఈ క్రెష్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆఫీసులకు, ఇతర డ్యూటీలకు వెళ్లే మహిళలు పిల్లలను చూసుకునేందుకు ఇంటి దగ్గర ఎవరూ లేకపోతే ఇబ్బందులు పడాల్సివస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంత మంది మహిళలు పిల్లలను కూడా తామ వెంట తీసుకువెళ్తున్నారు. పని చేసే చోట పిల్లలు ఉండేందుకు తగిన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. మూడేళ్ల వయస్సున్న పిల్లలను ప్లే స్కూళ్లకు పంపుతున్నా చిన్న పిల్లలకు చూసుకోవడం కష్టమవుతోంది. పెద్ద పట్టణాలు, సిటీల్లో అయితే డే కేర్​ సెంటర్లు ఉంటాయి. కామారెడ్డి లాంటి చోట్ల అలాంటి ఏర్పాట్లు ఉండవు. 

దీంతో కొత్త జిల్లా కేంద్రాల్లో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో క్రెష్​ ల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎంతమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు, వారికి ఎంతమంది 5 ఏండ్ల లోపు పిల్లలున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టరేట్​లోని ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 32 మంది ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్నట్టు లెక్క తేలింది. పట్టణంలోని ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్​ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళలకు ఎంతమంది ఐదేండ్ల లోపు పిల్లలున్నారో వివరాలు తెలసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ALSO READ : 9న కొత్త ఎనర్జీ పాలసీ ప్రకటిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి

వర్కింగ్​ ఉమెన్​ ఎవరైనా వారికి ఉపయోగపడేలా సెంటర్​ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పట్టణంలో కొన్ని అంగన్​వాడీ కేంద్రాలను పరిశీలించిన అధికారులు ఒక సెంటర్​ను ఎంపిక చేసినట్టు తెలిసింది. క్రెష్​ ఏర్పాటు చేసేందుకు అక్కడ స్థలం సరిపోతుందా.. వసతులు ఉన్నాయా అని పరిశీలించారు. పూర్తి సౌకర్యాలతో .. స్టాఫ్​తో త్వరలోనే క్రెష్​ ప్రారంభం కానుంది. పిల్లల సంఖ్యను బట్టి అవసరమైతే మరో క్రెష్​ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. 

వర్కింగ్​ ఉమెన్స్ కు మేలు ​

 వర్కింగ్ ఉమెన్స్​ పిల్లల కోసం జిల్లా కేంద్రంలో క్రెష్​ ​ ఏర్పాటు చేయనున్నాం. ఈ సెంటర్​ తో వర్కింగ్​ ఉమెన్స్​కు మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో నివేదిక పంపాం. సెంటర్​ ప్రారంభానికి ఆదేశాలు రావాల్సి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈసెంటర్​లో పిల్లలను సంరక్షిస్తాం ​ - ప్రమీల, ఐసీడీఎస్​ జిల్లా అధికారి