- కామారెడ్డి జిల్లా దిశ మీటింగ్‌లో
- జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్
- నివేదికలు చదివి వినిపించిన ఆయా శాఖల ఆఫీసర్లు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ ( దిశ) మీటింగ్ శనివారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వి.విక్టర్, మున్సిపల్చైర్మన్లు, దిశ కమిటీ మెంబర్లు, ఆయా శాఖల ఆఫీసర్లు హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు సాగిన మీటింగ్‌లో 23 శాఖల్లో కేంద్ర పథకాలు, అభివృద్ధి పనుల నివేదికలను ఆఫీసర్లు చదివి వినిపించారు.
కొన్ని శాఖల్లో ఆరేళ్ల క్రితం చేపట్టిన పనుల వివరాలను చదివి వినిపించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద జిల్లాలో 1,47,670 మంది రైతులకు 18 విడతల్లో రూ.531 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ స్కీమ్‌లో 1,70,897 మందికి 37,65,000 పనిదినాలు కల్పించినట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు.
రూర్బన్ కింద జుక్కల్ క్లస్టర్లో చేపట్టిన పనులకు సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని ఎంపీ ఆదేశించారు. గాంధారి మండలం సీతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు 515 బస్తాల వడ్లు అమ్మితే 2.80 క్వింటాళ్ల తరుగు తీశారని దిశ కమిటీ మెంబర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని సివిల్ సప్లయ్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు.
సమాచారం లేకుండా..
ఎంత జనాభాకు ఒక అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేస్తారని, కామారెడ్డి టౌన్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? వివరాలు చెప్పాలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ చందర్‌నాయక్‌ను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అడిగారు. తన వద్ద సమాచారం లేదని ఆయన బదులిచ్చారు. సమాచారం లేకుండా మీటింగ్‌కు ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి టౌన్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సిబ్బంది జీత భత్యాలకే పోతుందని, అభివృద్ది పనులకు ప్రత్యేక ఫండ్స్ ఇవ్వాలని ఎంపీని కోరారు. కామారెడ్డిలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నించాలని
కోరారు.
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
అధికారులు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎంపీ అన్నారు. ఆఫీసర్లు సమన్వయంతో పని చేస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావటానికి ప్రయత్ననిస్తానన్నారు. కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ మాట్లాడుతూ.. ఆయా శాఖలపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తామన్నారు. మీటింగ్‌లో చర్చించిన ఆంశాలపై వచ్చే మీటింగ్‌లోగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన్లు ఇందుప్రియ, గంగాధర్, శ్రీకాంత్, డీఆర్డీవో సురేందర్, ఆయా శాఖల ఆఫీసర్లు
పాల్గొన్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అధ్యక్షతన శనివారం జరిగిన మీటింగ్‌కు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి మిగతా ముగ్గురు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడాది తర్వాత నిర్వహించిన దిశ మీటింగ్‌కు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు కె.మదన్మోహన్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు గైర్హాజరయ్యారు.