
- కామారెడ్డి జిల్లాలో 446 వడ్ల కొనుగోలు సెంటర్లు
- మహిళా సంఘాల ఆధ్వర్యంలో 183 కేంద్రాలు
- కోతలు షూరు అయిన ఏరియాలో వారంలోనే సెంటర్లు ఓపెన్
కామారెడ్డి, వెలుగు : యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు సాఫీగా సాగేలా కామారెడ్డి జిల్లా యంత్రాంగం 446 సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. ఇందులో 183 సెంటర్లు మహిళా సమాఖ్యలకు కేటాయించింది. కోతలు షూరు అయిన ఏరియాల్లో వారంలోనే సెంటర్లు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులతో మీటింగ్లు నిర్వహించడంతోపాటు మహిళా సంఘాలకు ఒక రోజు శిక్షణ కూడా ఇచ్చారు. 6లక్షల 20వేల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 5.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ సెంటర్లకు రానుందని అధికారులు పేర్కొంటున్నారు.
సన్నరకం వడ్లు లక్షా 13వేల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 4.49 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందుకనుగుణంగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు గన్నీబ్యాగులు, స్యాడీ క్లీనర్లు, కాంటలను అందుబాటులో ఉంచనున్నారు. ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేందుకు రూట్ల వారీగా లారీలను రెడీగా ఉంచారు. ఎండలు మండుతుండడంతో సెంటర్ల వద్ద తాగునీటి వసతి, నీడ కోసం టెంట్లను వేస్తున్నారు.
ధాన్యం కాంటా కాగానే రైతు వివరాలు, ధాన్యం ఎంత, బ్యాంక్ అకౌంట్ నంబర్ ట్యాబ్లో ఎంట్రీ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొన్న ఒకటి, రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి వీలుటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సన్న రకం వడ్లు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తున్నందున ప్రభుత్వ సెంటర్లకు ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్ మండలాల్లో వరి నాట్లు ముందుగా వేయడం వల్ల కోతలు ప్రారంభమయ్యాయి.
మహిళ సంఘాలకు పెరిగిన సెంటర్లు..
మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పి కమీషన్ఇచ్చేలా ఏర్పాటు చేసింది. గతంలో మహిళా సంఘాలకు 27 సెంటర్లే ఇచ్చేది. ఈ యాసంగి సీజన్ 446 సెంటర్లకుగాను 183 సెంటర్లు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. కొనుగోళ్లకు కావాల్సిన యంత్ర సామగ్రి అంతా అందుబాటులో ఉందని అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్ పేర్కొన్నారు. కోతలు షూరు అయిన ఏరియాల్లో సెంటర్లు ఓపెన్ చేస్తామన్నారు. సెంటర్లలో వడ్లు అమ్మి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు.