చెరువులో దూకి .. జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య

చెరువులో దూకి .. జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య

కామారెడ్డి​, వెలుగు:  కామారెడ్డి జిల్లా బీబీపేట తహసీల్దార్​ ఆఫీసులో జూనియర్​అసిస్టెంట్ గా పని చేస్తున్న​ మర్కంటి శ్రీకాంత్​( 27) మంగళవారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇతడి అన్న గణేశ్​ (29) కూడా రెండునెలల క్రితం సూసైడ్​ చేసుకున్నాడు. జీతం రాక, పైసలకు ఇబ్బంది అవుతుండడంతో శ్రీకాంత్ ​కొన్నాళ్లుగా మానసిక వేదన అనుభవిస్తున్నాడని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...భిక్కనూరు మండలం  బస్వాపూర్​కు చెందిన మర్కంటి నాగరాణి, శంకరయ్యలకు ఇద్దరు కొడుకులు.

పెద్ద కొడుకు గణేశ్​ హైదరాబాద్​లోని ఓ కంపెనీలో ప్రైవేట్​ జాబ్​ చేసేవాడు. రెండో కొడుకు శ్రీకాంత్ ​గ్రామ వీఆర్ఏ కాగా, విలీనంలో భాగంగా కొన్ని నెలల కింద ప్రభుత్వం ఇతడిని బీబీపేట తహసీల్దార్​ఆఫీసులో జూనియర్​అసిస్టెంట్​గా నియమించింది. అప్పటి నుంచి జీతం ఇవ్వడం లేదు. దీంతో సొంతూరు బస్వాపూర్​లోనే ఉంటూ బీబీపేటకు వెళ్లి వచ్చేవాడు. మంగళవారం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో నుంచి లంచ్​ ​బాక్స్​ తీసుకుని బీబీపేటకు వెళ్లాడు.  తర్వాత తల్లి ఫోన్​చేయగా ఇంకా ఆఫీసు తీయలేదని చెప్పాడు.

కొద్దిసేపటికే బీబీపేట చెరువుకు వెళ్లి కట్టపై బైక్ పార్క్​ చేసి ఆధార్​కార్డు పెట్టి  చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్​లో జాయిన్​ అయినా జీతం రావట్లేదని తన కొడుకు బెంగ పెట్టుకున్నాడని, పైసలకు ఇబ్బంది అవుతుందని చెప్పేవాడని మృతుడి తండ్రి శంకరయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకరయ్య పెద్ద కొడుకు గణేశ్​గత ఏడాది నవంబర్​లో హైదరాబాద్​లో ఉరేసుకున్నాడు. ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే చిన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులను తీవ్ర విషాదంలో మునిగిపోయారు.