- సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ జిల్లాల కూడలిగా కామారెడ్డి
- కాలనీల ఏర్పాటుతో విస్తరిస్తోన్న జిల్లా కేంద్రం
- పెరిగిన క్రైమ్ రేట్
- నియంత్రణకు పోలీసులు అవస్థలు
- ప్రతిపాదనలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రం విస్తరిస్తోంది. టౌన్ నుంచి జిల్లా కేంద్రంగా మారి సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు కామారెడ్డి కూడలిగా మారింది. వ్యాపారం, విద్యతోపాటు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇక్కడికి వచ్చి నివసించే వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఇలా రోజు రోజుకు టౌన్ విస్తరిస్తున్నప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణకు తగినంత పోలీసు యంత్రాంగం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ పరిధిలో 1,04,267 జనాభా ఉంది. 49 వార్డులు ఉన్నాయి.
నాటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఒక పోలీస్స్టేషన్ మాత్రమే ఉంది. జిల్లా కేంద్రంగా మారడంతోపాటు, పెరిగిన జనాభాకు అనుగుణంగా మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావాల్సి ఉన్నా చర్యలు చేపట్టలేదు. దీనికి ట్రాఫిక్ రద్దీపెరిగింది. ట్రాఫిక్పోలీస్స్టేషన్, మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పెరిగిన క్రైమ్ రేట్
జిల్లా కేంద్రం నడిబొడ్డు నుంచి నలువైపుల నాలుగైదు కిలో మీటర్ల వరకు విస్తరించింది. కాలనీలు పెరిగాయి. క్రైమ్ రేట్కూడా పెరిగింది. చోరీలు, ఆత్మహత్యలు, మహిళలపై వేధింపులు, యాక్సిడెంట్ కేసులు పెరిగాయి. హైవే, రైల్వే లైన్ఉండటంతో ప్రజల రాకపోకలు పెరుగుతున్నాయి.
జిల్లా కేంద్రానికి వీఐపీల తాకిడి ఎక్కువే. నేర పరిశోధనలు, నేరాలు జరగకుండా పెట్రోలింగ్, వీఐపీల బందోబస్తు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు
జరుగుతుంటాయి. వీటన్నింటిని ప్రస్తుతం ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది. ఇక్కడ మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. టౌన్ లో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి.
అస్తవ్యస్తంగా ట్రాఫిక్
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేదు. ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ ఐదుగురుని ట్రాఫిక్ డ్యూటీకి కేటాయించారు. వీరు చలాన్లు వేయటానికి మాత్రమే పరిమితమవుతున్నారు. మెయిన్రోడ్లు, ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. స్థానికులతోపాటు, వివిధ అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. దీంతో వందలాది వెహికల్స్ రాకపోకలు ఎక్కువయ్యాయి. చౌరస్తాల్లో ఎవరు ఎటు నుంచి వస్తున్నారో తెలియడంలేదు. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కొన్ని సార్లు ట్రాఫిక్ జామ్ అవుతోంది.
కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరాచౌక్, పాత బస్టాండ్, రామారెడ్డి రోడ్డు చౌరస్తా, సుభాష్ రోడ్డు చౌరస్తా, జేపీఎన్ రోడ్డు చౌరస్తాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. టౌన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కాగితాల్లో నే ఉంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. గత సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నాటి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. అయినా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం పెరిగినా జనాభా, అవసరాల దృష్ట్యా టౌన్లో మరో పోలీస్ స్టేషన్ తో పాటు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.