వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. గంగ పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. 

రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన మనుశ్రీ జ్వరం, విరోచనాలు కావడంతో తల్లిదండ్రులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంగ పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు చేస్తుండగా పాపకి ఫిట్స్ వచ్చింది. ఆతర్వాత మనుశ్రీ చికిత్స పొందుతూ మృతి చెందింది.

చిన్నారి మృతికి వైద్యులే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మనుశ్రీ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.