యథేచ్చగా లింగ నిర్ధారణ టెస్టులు

యథేచ్చగా లింగ నిర్ధారణ టెస్టులు
  • పుట్టేది ఆడో.. మగో.. ఇంటికొచ్చే చెప్తున్నరు
  • కేసులు నమోదవుతున్నా అగని అక్రమ దందా
  • ఇతర స్టేట్​ల నుంచి సైతం వస్తున్న పెషేంట్లు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా అక్రమ లింగ నిర్ధారణ టెస్టులకు అడ్డాగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్థారణ పరీక్షలు చేయడంతోపాటు ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నారు. చివరికి మొబైల్​ కిట్లతో ఇంటికే వెళ్లి లింగనిర్ధారణ చేస్తున్నారు. దీంతో పొరుగు జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా టెస్టుల కోసం వస్తున్నారు. 

కడుపులో ఉన్నది ఆడోమగో స్కానింగ్​ చేసి చెప్పడం చట్టరీత్యా నేరం. చాలాచోట్ల స్కానింగ్​ సెంటరల్లో గర్భస్థ శిశువుల హెల్త్​ కండిషన్​ తెలుసుకునేందుకు స్కానింగ్​ చేస్తున్నా లింగనిర్థారణ పరీక్షలు చేయడంలేదు. ఇదే అదునుగా కామారెడ్డిలో పలువురు లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. ఇటీవల పలు ఘటనలు బయటపడగా అధికారులు కేసులు నమోదు చేసి హాస్పిటల్స్​ను సీజ్​ చేశారు.

ఒక హాస్పిటల్​ను సీజ్​ చేస్తే మరోచోట మరో పేరుతో హాస్పిటల్​పెట్టి అక్రమ దందా కొనసాగిస్తున్నారు. చివరకు మోబైల్​ కిట్లతో ఇళ్లకు వెళ్లి మరీ టెస్టులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి అర్హతలు, నైపుణ్యం లేని వ్యక్తులు ఇలాంటి టెస్ట్​లు చేయడం వల్ల గర్భిణులకు ముప్పు కలిగే అవకాశం కూడా ఉంది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిల్లో 26 స్కానింగ్​ సెంటర్లకు వైద్య, ఆరోగ్య శాఖ పర్మిషన్లు ఉన్నాయి. 

ఇందులో కొన్ని ప్రైవేట్​ హాస్పిటల్స్​లో ఉండగా మరికొన్ని ప్రత్యేకంగా స్కానింగ్​ సెంటర్ల పేరుతో కొనసాగుతున్నాయి. ఈ సెంటర్లలో పెషేంట్, గర్భస్థ శిశువు హెల్త్​ కండిషన్​ తెలుసుకునేందుకే స్కానింగ్​ చేయాలి. పుట్టబోయేది ఆడ బిడ్డ, మగ బిడ్డ అన్నది బయటకు చెప్పరాదు. స్కానింగ్​ సెంటర్​లో అనుభవం ఉన్న టెక్నిషియన్​, రేడియాలజిస్ట్​ ఉండాలి. జిల్లాలో ఉన్న పలు స్కానింగ్​ సెంటర్లలో టెక్నిషియన్లు కానీ, రేడియాలజిస్ట్ లు కానీ లేరు. రేడియాలజిస్టుల పేర్లతో పర్మిషన్​ తీసుకొని వేరేవాళ్లు నడిస్తున్నారు. 

ఇష్టారాజ్యంగా టెస్టులు

కామారెడ్డిలోని కొన్ని ప్రైవేట్​ హాస్పిటల్స్​లో లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. 2021లో శ్రీరాంనగర్​ కాలనీలో కౌసల్య హాస్పిటల్​లో ఈ టెస్ట్​లు చేస్తున్నట్టు ఫిర్యాదులు రాగా.. స్టేట్​ హెల్త్ టీమ్​ తనిఖీలు చేపట్టింది. సెంటర్​లో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా వీడియో రికార్డు చేశారు. హాస్పిటల్​ను సీజ్​ చేసి, నిర్వహాకులను అరెస్టు చేశారు.

 ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్వహాకులు మరో పేరుతో హాస్పిటల్​ను ఓపెన్​ చేశారు. ఇతర ప్రాంతాల్లో లింగనిర్ధారణ పరీక్షల మీద నిఘా ఉండడంతో మహారాష్ట్ర, కర్నాటక లనుంచి కూడా పెషేంట్లు కామారెడ్డికి వస్తున్నారు. గర్భం దాల్చిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్​పేషెంట్​ను తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తున్నారు. ఆడ బిడ్డ అని తేలితే ఇక్కడే అబార్షన్లు చేయిస్తున్నారు. 

మొదటి కాన్పులో ఆడబిడ్డ కలిగి రెండో సారి గర్భం దాల్చినవారే ఎక్కువగా ఇక్కడకు వస్తున్నారని తెలుస్తోంది. స్కానింగ్​ చేసి అడో , మగో చెప్పడానికి రూ. 10వేల నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. లింగ నిర్ధారణ టెస్టులో ఆడ పిల్ల అని తేలితే అబార్షన్​ చేయిస్తున్నారు. కామారెడ్డిలో అబార్షన్​ చేసేందుకు రెండు హాస్పిటల్స్​కు మాత్రమే పర్మిషన్​ ఉంది. కానీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా చాలా చోట్ల ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్​ చేస్తున్నారు.

మొబైల్​ స్కానింగ్​రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆర్​ఎంపీ బల్ల రవీందర్​ మొబైల్​ కిట్లతో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్న విషయం ఇటీవల బయట పడింది. ఇతడు మూడేండ్లుగా పరీక్షలు చేస్తున్నాడు.

ఈ పరీక్షలు చేయడానికి అతనికి ఎలాంటి అర్హతలులేవు. సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళకు లింగ నిర్ధారణ టెస్టులు చేస్తుండగా టాస్క్​పోర్స్​ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. రవీందర్​తో అతనికి అల్ట్రా సోనోగ్రాప్​ మిషన్అమ్మిన ఇద్దరు వ్యక్తులను, అతనికి పెషేంట్లను పంపిస్తున్న ఇద్దరు ఆర్​ఎంపీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్ల నిర్లక్ష్యంవల్లే ఈ దందాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.