లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మద్దెల కమలవ్వ (70) అనుమానాస్పదంగా చనిపోయింది. రెండు రోజుల పాటు కమలవ్వ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో బుధవారం ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి ఆమె కుమారుడు కుమార్కు ఫోన్ చేసి చెప్పారు.
అతను హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకుని తలుపు తెరిచి చూడగా కమలవ్వ మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. శవం కుళ్లిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రెండు రోజుల క్రితమే కమలవ్వను గుర్తుతెలియని వ్యక్తులు బంగారు నగల కోసం హత్యచేసి ఉండవచ్చని గ్రామస్థులు చెప్పారు. ఆమె ఒంటిపై బంగారు నగలు లేవని తెలిపారు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.