మద్యానికి బానిసై అప్పుల పాలు..యువకుడి ఆత్మహత్య.. బెల్టు షాపులకు వ్యతిరేకంగా కదిలిన గ్రామస్తులు

  • మృతదేహంతో ఆందోళన.. మద్యం బాటిళ్ల ధ్వంసం
  • గ్రామంలో లిక్కర్​ అమ్మకాలపై నిషేధం విధిస్తూ తీర్మానం
  • కాదని ఎవరైనా అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయం
  • కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లిలో ఘటన

భిక్కనూరు/కామారెడ్డి, వెలుగు: వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న యువకుడు కాస్తా.. కొద్ది రోజులుగా లిక్కర్‌‌‌‌కు బానిసయ్యాడు. దొరికినకాడల్లా అప్పులు చేసి.. గ్రామంలోని బెల్టుషాపులో రోజూ తాగేవాడు. డ్రింకింగ్‌‌ను మానలేకపోవడం, అప్పులవాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువ రైతు ఆత్మహత్య ఊరు మొత్తాన్ని కదలించింది. అతడి డెడ్‌‌బాడీని తీసుకువెళ్లి బెల్టుషాపు ముందు ఆందోళన చేశారు. తర్వాత ఊరి పెద్దలంతా సమావేశమై గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైనా లిక్కర్ అమ్మినట్లు తెలిస్తే రూ.5 లక్షల జరిమానా విధించాలని తీర్మానించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లిలో మంగళవారం జరిగిందీ ఘటన.

గ్రామంలో 3 బెల్టు షాపులు

రామేశ్వర్​పల్లికి చెందిన నాగర్తి నరేశ్​రెడ్డి (37) తనకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒకప్పుడు ఈ గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు ఉండేవి కాదు. కానీ బీఆర్ఎస్ సర్కారు లిక్కర్ సేల్స్‌‌ను ప్రోత్సహిస్తుండడంతో ఏకంగా మూడు బెల్టుషాపులు ఏర్పడ్డాయి. ఎనీ టైమ్ మద్యం దొరుకుతుండడంతో చాలామంది తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ క్రమంగా నరేశ్​రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. దీంతో దొరికినకాడల్లా అప్పులు చేశాడు. నరేశ్​రెడ్డికి భార్య మమత, కొడుకు, బిడ్డ ఉన్నారు. తాగుడు కారణంగా వాళ్లను బాగా చూసుకోలేకపోతున్నానని, మద్యం మానలేకపోతున్నానని, తన వల్ల అప్పులవుతున్నామని కలత చెందాడు. దీంతో సోమవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

లిక్కర్ బాటిళ్లను పగులగొట్టి..

గ్రామస్తులు నరేశ్​రెడ్డి మృతదేహాన్ని ట్రాక్టర్‌‌‌‌లో తీసుకెళ్లి.. బెల్టుషాపు ముందు ఉంచారు. బెల్టుషాపు మూసివేయాలంటూ నినాదాలు చేశారు. తర్వాత డెడ్‌‌బాడీని పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌‌కు పోలీసులు తరలించారు. గ్రామ పెద్దలంతా ఊర్లో సమావేశమయ్యారు. గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని, వెంటనే మూడు బెల్టుషాపులను మూయించాలని తీర్మానించారు. ఇకపై ఊరిలో ఎవరైనా మద్యం అమ్మితే  రూ.5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారు. బెల్టుషాపుల్లో ఉన్న లిక్కర్ బాటిళ్లను తీసుకొని గాంధీ విగ్రహం ఎదుట చౌరస్తాలో పగులగొట్టారు.

లిక్కర్‌‌‌‌కు బానిసైతున్రు

ఊర్లో బెల్టుషాపులు ఉండటంతో ఎప్పు డంటే అప్పుడు లిక్కర్ అమ్ముతున్రు. చాలా మంది మద్యానికి బానిస అయి తున్రు. ఊరి పెద్ద వాళ్లమంతా కలిసి బెల్టు షాపులను తొలగిస్తూ తీర్మానించాం. అందరు కట్టుబడి ఉండాలని చెప్పాం.
- బద్దం ఇంద్రకరణ్​రెడ్డి

అమ్మొద్దని నిర్ణయించాం


రామేశ్వర్​పల్లిలో మద్యం అమ్మకాలు లేకుండా చేయాలని నిర్ణయించాం. బెల్టు షాపుల్లో ఉన్న మందు సీసాలను తీసుకొచ్చి గాంధీ విగ్రహం ముందు పగులగొట్టాం. ఎవరు మందు అమ్మినా జరిమానా విధిస్తాం.
- నాగర్తి భూమ్​రెడ్డి