కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్తున్న రోడ్లు, రోడ్ల వెడల్పు పనుల్లో శాఖల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం సమస్యగా మారింది. ఫారెస్ట్ ఏరియాల్లో నుంచి కొత్తగా వేస్తున్న రోడ్లు, డబుల్ రోడ్లుగా మార్చాల్సిన సమయంలో సంబంధిత శాఖ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం సమస్యగా మారుతోందనే విమర్శలున్నాయి. గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో ఈ సమస్య ఉంది.
చర్చకు వచ్చినా..
ఫారెస్ట్ ఏరియాలో నుంచి వేసే రోడ్ల విషయం పలుమార్లు జడ్పీ మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చింది. రోడ్ల కోసం వచ్చిన ఫండ్స్ వెనక్కి వెళ్తున్నాయని సభ్యులు ఫైర్ అయ్యారు. ఇంజనీరింగ్, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతోందని సభ్యులు వాపోతున్నారు. ప్రపోజల్ పంపే ముందు క్లియరెన్స్ కోసం లెటర్ రాస్తున్న ఇంజనీరింగ్ ఆఫీసర్లు, ఆ తరువాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న ఫైల్స్‌ను ఫాలోఅప్చేయడంలో చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్‌గా మారిస్తే అభ్యంతరం తెలపడంపై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు కంప్లీట్చేయించాలని కోరుతున్నారు.
‘ఇది గాంధారి నుంచి బాన్స్వాడ వెళ్లే రోడ్డు. ప్రతిరోజు వందలాది వెహికల్స్ రాకపోకలు సాగిస్తాయి. సింగిల్‌గా ఉన్న రోడ్డును ఐదేండ్ల కింద డబుల్ రోడ్డుగా మార్చారు. మధ్యలో కొన్ని కిలో మీటర్లు ఫారెస్ట్ ఏరియాలో నుంచి వెళ్తుంది. బాన్స్వాడ మండల పరిధిలో ఫారెస్ట్ క్లియరెన్స్ రావడంతో ఇక్కడ డబుల్ రోడ్డు వేశారు. గాంధారి మండలం పెద్ద పొతంగల్ శివారులో 3కిలోమీటర్లు క్లియరెన్స్ లేక పనులు చేయలేదు. జడ్పీ మీటింగ్‌లో ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రస్తావించినా ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదు. ఇలా జిల్లాలో పలు రోడ్లు చిన్న కారణాలతో ముందుపడ్తలేవు.’
తాడ్వాయి మండలం నందివాడ నుంచి లింగంపేట మండలం కొమట్పల్లి వైపు ఏడేండ్ల కింద రోడ్డు నిర్మాణం చేపట్టారు. మధ్యలో కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది. పర్మిషన్ లేకుండా పనులు చేయవద్దని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పడంతో నిలిచిపోయాయి. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ వైపు వెళ్లే రోడ్డు కొంత భాగం క్లియరెన్స్ రాక సింగిల్ రోడ్డుగానే ఉంది. మాచారెడ్డి మండలం పల్వంచ నుంచి బీబీపేట మండలం జనగామ వరకు డబుల్ రోడ్ పనులు రెండేండ్ల కింద ప్రారంభించారు. అంబారీపేట సమీపంలో ఫారెస్ట్ ఏరియా ఉండడంతో పనులను నిలిపివేయాల్సి వచ్చింది. రోడ్డు పనులు నిలిపేయడంపై జడ్పీ మీటింగ్‌లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మండల ప్రజాప్రతినిధులు ఫారెస్ట్ ఆఫీసర్లను నిలదీశారు. రామారెడ్డి మండల కేంద్రం నుంచి మద్దికుంట వైపు డబుల్ రోడ్డుగా మార్చినప్పటికీ, అటవీ ప్రాంతంలో మాత్రం సింగిల్రోడ్డే ఉంది.