లైంగిక వేధింపులకు చెక్.. స్కూల్​కో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నియామకం

లైంగిక వేధింపులకు చెక్.. స్కూల్​కో  చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నియామకం
  • 1,196 పాఠశాలల్లో అమలు
  • టీచర్లు, హెడ్మాస్టర్లకూ ట్రైనింగ్ 
  • స్టూడెంట్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్న జిల్లా యంత్రాంగం 

కామారెడ్డి, వెలుగు :లైంగిక వేధింపుల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురికాకుండా  ప్రతి పాఠశాలకు ఒక చైల్డ్​ ప్రొటెక్షన్​ అధికారిని నియమించనున్నది. ఇందుకుగాను టీచర్లు, హెచ్​ఎంలు, రెసిడెన్సియల్​ స్కూల్​ ఇన్​చార్జీలకూ శిక్షణ ఇస్తున్నారు.  జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చైల్డ్ ప్రొటెక్షన్​ అధికారులను నియమించారు.  జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో 15 వరకు లైంగిక వేధింపుల సంఘటనలు చోటుచేసుకోగా,  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  

భవిష్యత్​లో  ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ప్రొటెక్షన్​ అధికారికి తెలిపితే.. వెంటనే కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో1,196  ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి.  ఇందులో  రెసిడెన్సియల్​ స్కూల్స్ 129,  ప్రైమరీ స్కూల్స్​ 637,  అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 123, హైస్కూల్స్ 182,  ప్రైవేట్​ స్కూల్స్​ 175 ఉన్నాయి.  ఇటీవల జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో లైంగిక దాడుల ఘటనలు జరుగగా,  టీచర్లపై కూడా పోక్సో కేసులు నమోదయ్యాయి. 

విద్యార్థినులను తాకరాని చోట తాకడం, సూటిపోటీ మాటలతో ఇబ్బందులకు గురిచేయడం వంటి ఘటనలు జరిగాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే ఇలాంటి చర్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల ద్వారా కొన్ని ఘటనలు వెలుగులోకి రాగా,  మరి కొన్ని   షీ టీమ్స్ అవగాహన కల్పించిన తర్వాత బయటకొచ్చాయి. 

ఐసీడీఎస్​, బాలికల సంరక్షణ విభాగం,  యూనిసెఫ్​ సహకారంతో..

ఐసీడీఎస్​, బాలికల సంరక్షణ విభాగం, యూనిసెఫ్​ సహకారంతో ఈ ప్రకియ కొనసాగుతున్నది. ప్రతి స్కూల్​లో ఒక మహిళా టీచర్ లేదా సీనియర్​ ఉపాధ్యాయుడిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఫోక్సో  యాక్ట్, గుడ్ టచ్​, బ్యాడ్​ టచ్, వేధింపులు, బాలికల హక్కులు, చట్టాలను వివరిస్తున్నారు. 

మొదటి విడతలో యూనిసెఫ్​ అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత పోలీసు, న్యాయ, మహిళా సంఘాల ప్రతినిధులతో శిక్షణ ఇవ్వనున్నారు.  చైల్డ్​  ప్రొటెక్షన్ అధికారులు నిరంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ ధైర్యం చెప్పడంతోపాటు విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియజేయనున్నారు. కంప్యూటర్ ల్యాబ్​లు,  వరండాల్లో ప్రొటెక్షన్​ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.  

జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు..

జిల్లాలోని నిజాంసాగర్​ మండలంలోని ఓ విద్యాలయంలో విద్యార్థినులను వేధించడంతో నలుగురు టీచర్లపై కేసు నమోదైంది. భిక్కనూరు, కామారెడ్డి,  గాంధారి, తాడ్వాయి,  బాన్సువాడ ఏరియాల్లో వేధింపులు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.  జిల్లావ్యాప్తంగా 12 వరకు కేసులు నమోదు కాగా, మరి కొందరు బయటకు చెప్పుకోలేకపోయారు.

విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం..

ప్రతి పాఠశాలలో చైల్డ్​ ప్రొటెక్షన్​ అధికారిని నియమించాం. బ్యాచ్ ల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. శిక్షణ పొందిన అధికారులు విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.  లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుపనున్నారు. - ప్రమీల,  జిల్లా మహిళా సంక్షేమ అధికారి