
- కామారెడ్డి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు
- మూడు నెలల్లో 58 మంది మృత్యువాత, 122 మందికి గాయాలు
- ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ఫోకస్
- కామారెడ్డి జిల్లాలో 28 బ్లాక్ స్పాట్ల గుర్తింపు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రహదారులు నరకానికి తొవ్వలుగా మారాయి. గడిచిన మూడు నెలల్లో 135 యాక్సిడెంట్లు కాగా, 58 మంది మృత్యువాత పడ్డారు. 122 మందికి తీవ్ర గాయాలై అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో జిల్లా యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. రోడ్డు ప్రమాదాల నివారణకు 28 బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు తీసుకుంటుంది. జిల్లా మీదుగా 2 నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలు ఉన్నాయి. నిత్యం ఏదో ఓ చోట యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు ఉన్న హైవేతో పాటు, సంగారెడ్డి నుంచి ఆకోల వైపు వెళ్లే హైవేపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, టర్నింగ్‌లు, ఆధ్వాన రోడ్లు, రోడ్డు పక్కన వెహికిల్స్ ఫార్కింగ్, నిద్ర మత్తులో డ్రైవింగ్వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో అధికంగా యాక్సిడెంట్లు జరిగే 28 బ్లాక్ స్పాట్లు ఉండగా, ప్రమాదాకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. రోడ్డు సేప్టీ మీటింగ్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, ఆర్టీఏ , హైవే, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొని బ్లాక్ స్పాట్లపై చర్చించారు.
ప్రమాదాల నివారణకు చర్యలు..
దేవునిపల్లి, భిక్కనూరు, సదాశివనగర్, నిజాంసాగర్, పిట్లం, మద్నూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో హైవేపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 4 లైన్ల హైవే కావటంతో వెహికిల్స్ స్పీడ్‌గా వెళ్తున్నాయి. టర్నింగ్‌లు, టౌన్ ఎంట్రీల దగ్గర బ్రిడ్జిలు లేకపోవటం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. టెకిర్యాల్, నర్సన్సపల్లి, పద్మాజీవాడి చౌరస్తా వద్ద హైవేపై బ్రిడ్జిల నిర్మాణం కంప్లీట్ చేశారు. హైవేపై స్పీడ్ లిమిట్ 80గా నిర్ణయించారు. ఇంతకంటే స్పీడ్‌గా వెళ్లే వాహనాలకు ఫైన్ విధిస్తున్నారు.
సర్వీసు రోడ్లు దిగే చోట రాత్రి పూట కనిపించేందుకు లైట్లు ఏర్పాటు చేశారు. టర్నింగ్‌లు, యూ టర్న్‌ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లా, ఇతర రోడ్లపై స్పీడ్ కంట్రోల్ కోసం స్పీడ్ బ్రేకర్లు, జిల్లా కేంద్రంలో డివైడర్లు బిగించారు. నిరంతరం తనిఖీలు చేపట్టి ర్యాష్ డ్రైవింగ్‌లు, మైనర్ డ్రైవింగ్‌లు, డ్రంక్అండ్డ్రైవ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొత్తం 153 ప్రమాదాలు జరిగితే 78 మంది చనిపోగా, 142 మంది గాయపడ్డారు. ఈ ఏడాది మూడు నెలల్లో 17 కేసులు తగ్గాయి.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి...
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలి. స్పీడ్‌గా వెళ్లొద్దు. టర్నింగ్‌ల వద్ద ఇండికేషన్ రేడియం స్టిక్కర్లను గమనించాలి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. టెక్నికల్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. - కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర
జిల్లాలో మూడేండ్లకుపైగా జరిగిన రోడ్డు ప్రమాదాలు ఇలా..
సం. ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
202 2 561 271 502
2023 555 236 480
2024 569 276 468
2025 136 58 122