కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు, జిల్లాలో తాజా పరిణామాలపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్ విచారణను న్యాయస్థానం కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు భూములను మాస్టర్ ప్లాన్ జాబితాలో పెట్టారని పిటిషనర్లు వాదించారు. మాస్టర్ ప్లాన్ కు నిరసనగా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని రైతులు పిటీషన్ లో పేర్కొనగా... తమను సంప్రదించకుండా భూములను రీ క్రియేషనల్ జోన్ గా ప్రకటించారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ చూస్తే కేవలం తమను ఇబ్బంది పెట్టేందుకే అన్నట్టుగా ఉందని ఈ సందర్భంగా రైతులు వాపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా రైతులపై జరిగిన దాడుల అంశాలను సైతం రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలపనున్నట్టు సమాచారం.
మాస్టర్‌ప్లాన్‌పై నిరసనలు ఎందుకంటే..
కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ప్రపోజల్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్‌పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీంతో డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్లాన్‌లో ఇక్కడ 8.5 శాతం ఏరియా 1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రీయల్ కింద ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్ హైవే పక్కన..టౌన్ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పచ్చని పంటలు పండే అడ్లూర్, ఇల్చిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాలకు చెందిన భూములు ఉండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ జోన్లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ రాదని, నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని, ఫలితంగా భూముల విలువ తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా.. తమకు చెప్పకుండా మాస్టర్ ప్లాన్ ఎలా తయారు చేస్తారంటూ రైతులు నిలదీస్తున్నారు. 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన మీదా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.