పంట నష్టం పరిహారంపై ప్రభుత్వం కుంటిసాకులు

కామారెడ్డి ,  వెలుగు: అకాలవర్షానికి పంట దెబ్బతిని  సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు  అధికారులు కోలుకోలేని షాక్​ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీగా పెట్టుబడి పెట్టి  సాగు చేసిన రైతులను  పంట చేతికొచ్చే సమయానికి చెడగొట్టువానలు నిలువునా ముంచాయి. ఈసారి  నష్టపోయిన రైతులకు ఎకరానిక రూ. 10 వేల పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో  ఎంతోకొంత ఊరట కలుగుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా.. అధికారులు 14 ఎకరాల్లో మాత్రమే  మక్క పంట దెబ్బతిన్నట్టు లెక్క తేల్చారు. దీంతో సర్కారు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటనష్టాన్ని తేల్చడానికి ప్రభుత్వం జారీ చేసిన  మార్గదర్శకాలు రైతులకు శాపంగా మారాయి.  జిల్లాలో కేవలం మక్కజొన్న పంట నష్టాన్నే పరిశీలించాలని,  33 శాతానికి పైగా దెబ్బతింటేనే రిపోర్ట్​చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.   

13 మంది రైతులకే పరిహారం

జిల్లాలో  గత నెల  కురిసిన ఆకాల వర్షాలకు   500 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి.    వరి, మక్క,  జొన్న పంటలకు నష్టం జరిగింది. అకాలవర్షాలవల్ల  పంటనష్టాన్ని  క్షేత్ర స్థాయిలో  పరిశీలించి  రైతుల వారీగా  వివరాలు అందించాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు  జిల్లా  ఆఫీసర్లను ఆదేశించారు.  అయితే  కేవలం మక్క పంట వివరాలు మాత్రమే పంపాలని,  33 శాతానికి  పైగా నష్టం జరిగిన రైతుల వివరాలే సేకరించాలని   సూచించారు.ఇందుకు అనుగుణంగా పంటలను పరిశీలించినఅధికారులు  జిల్లాలో  13 మంది రైతులకు చెందిన   14.15 ఎకరాల్లో  మక్క పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు.  సదాశివనగర్​ మండలంలో 12 ఎకరాల  15 గుంటలు,  రాజంపేట మండలంలో  2 ఎకరాల్లో నష్టం జరిగినట్టు  తేల్చారు.   వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నప్పటికీ నష్ట పరిహారం మాత్రమే 14 ఎకరాలకే అందనుంది. 

గతంలో పరిహారం ఇవ్వలే  

గతంలో  కూడా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు గవర్నమెంట్​ ఎలాంటి పరిహారం ఇవ్వలేదు.    ఫసల్​ బీమా యోజన అమలు కాకపోవటం,   సర్కారు పరిహారం ఇవ్వకపోవటంతో గతంలో  రైతులు ఆర్థికంగా నష్టపోయారు.     2021 వానాకాలంలో  7,798 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు  అగ్రికల్చర్​ ఆఫీసర్లు  ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో  3,326 ఎకరాల్లో వరి,   1,583 ఎకరాల్లో మక్క, 2,528 ఎకరాల్లో సోయా, 19 ఎకరాల పత్తి తదితర పంటలున్నాయి.   2022 లో   18,397  ఎకరాల్లో పంటలకు నష్టం  వాటిల్లింది.   సోయా 11, 635 ఎకరాలు,  వరి 1,842 ఎకరాలు,   పెసర 1,638 ఎకరాలు, మినుము  1,313 ఎకరాలు,  పత్తి 833 ఎకరాలు,  మక్క 22 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.  యాసంగి సీజణ్లోనూ  వేలాది ఎకరాల్లో  పంటలు దెబ్బతిన్నప్పటికీ  ప్రభుత్వ పరంగా సాయం రాలేదు.  ఈ యాసంగి సీజన్​లో    పరిహారం ఇస్తామని చెప్పిన సర్కారు అడ్డగోలు నిబంధనలతో పరిహారాన్ని ఎగవేస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.