కామారెడ్డి, వెలుగు : షాపుకు సమీపంలో మూత్రం పోయొద్దన్నందుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడిపై మరో ఐదుగురు దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌కు సమీపంలోని ఓ ఫర్నిచర్షాపు సమీపంలో గత నెల 30న రాత్రి కొందరు యువకులు మూత్రం పోస్తుండగా పోయవద్దని షాపు ఓనర్ సూర్యకాంతం( 25) కోరాడు.
ఈ విషయంలో మాట మాట పెరగడంతో సదరు యువకులు అక్కడి నుంచి వెళ్లి కొద్దిసేపటికి మరికొందరిని తీసుకువచ్చారు. ఐదుగురు కలిసి సూర్యకాంతంను కర్రలు, ఇటుకలతో తలపై కొట్టారు. తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.