- కామారెడ్డి జనరల్ హాస్పిటల్ లో 12 పోస్టులు ఖాళీ.. ప్రస్తుతం 5 డాక్టర్లతోనే సేవలు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జనరల్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. 12 పోస్టులు ఉండగా ప్రస్తుతం అయిదుగురు డాక్టర్లు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఇంకా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ చెకప్‌తో పాటు, డెలీవరికి వందల మంది గర్భిణులు ఈ హాస్పిటల్ కు వస్తుంటారు. సరిపడా డాక్టర్లు లేక పెషేంట్లకు సేవలు అందించటంలో సమస్య ఏర్పడుతోంది. వైద్య విధాన పరిషత్ లో ఉన్న కామారెడ్డి జిల్లా హాస్పిటల్ ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభంతో జనరల్ హాస్పిటల్ స్థాయి పెరిగింది.
దీనికి అనుగుణంగా ఆయా విభాగాల్లో డాక్టర్ల పోస్టుల సంఖ్య పెరిగింది. ఇక్కడకు డెలివరీల కోసం ఎక్కువ సంఖ్యలో వస్తారు. జనరల్ హాస్పిటల్‌గా మారిన సేవలు మరింత మెరుగవుతాయని భావించారు. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జనరల్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో 12 డాక్టర్ల పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్లు 2, అసోసియేట్ ప్రొఫెసర్లు 2, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండాలి. ప్రస్తుతం ప్రొఫెసర్లు ఇద్దరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు. ఐదు అసిస్టెంట్‌ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో ముగ్గురిలో ఇద్దరు రెగ్యులర్ వారు కాగా.. మరొకరు కాంట్రాక్టర్ పద్ధతిలో పని చేస్తున్నారు.
గర్భిణుల తాకిడి ఎక్కువ
కామారెడ్డి హాస్పిటల్‌కు ఫస్ట్ నుంచి గర్బిణుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ ఏరియా వాళ్లే కాకుండా పక్కనున్న రాజన్న సిరిసిల్లా జిల్లా బార్డర్ గ్రామాల నుంచి కూడా ఇక్కడకు డెలివరీకి వస్తారు. వారంలో 3 రోజులు గర్భిణులకు రెగ్యులర్ చెకప్ చేస్తారు. ప్రతినెలా 300 నుంచి 350 వరకు డెలివరీలు
జరుగుతాయి. ఇందులో సగం వరకు నర్మల్ డెలవరీలు కాగా, మిగతా సగం సిజేరియన్ డెలివరీలు ఉంటాయి.
సరిపడా డాక్టర్లు లేక సమస్య
జనరల్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో సరిపడా డాక్టర్లు లేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రొఫెసర్లు కూడా రాత్రి డ్యూటీలు చేయాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో డాక్టర్లు లేకపోవటంతో ట్రీట్మెంట్కు వచ్చే గర్భిణులు, డెలివరీకి వచ్చే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. డెలివరీకి వచ్చే వాళ్లకు ఫస్ట్ నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. 24 గంటలు దాటిన కూడా నార్మల్ డెలివరీ కాకపోతే సిజేరియన్ చేస్తున్నారు. డాక్టర్లు తక్కువగా ఉండటం, చెకప్‌లు, ట్రీట్మెంట్, డెలివరీలు ఎక్కువగా ఉండటంతో సేవల్లో జాప్యం జరుగుతుంది. డెలివరీ వెంటనే చేయట్లేదని, వెయిట్చేయిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.
ఉన్న వారితోనే సేవలు అందిస్తున్నాం
గైనిక్ విభాగంలో తక్కువ మంది డాక్టర్లు ఉన్నప్పటికీ మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఇక్కడ పోస్టుల ఖాళీగా ఉన్నదానిపై ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అయిగురితోనే డాక్టర్లతోనే నిరంతరం సేవలు అందిస్తున్నాం. ఇక్కడ డెలివరీల సంఖ్య ఎక్కువగా ఉంది. – డాక్టర్ పరీదా, హాస్పిటల్ సూపరింటెండెంట్