కిలిమంజారోను అధిరోహించిన కామారెడ్డి బాలిక

కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ గిరిజ‌న బాలిక అరుదైన ఘ‌నత సాధించింది. జ‌నవ‌రి 26న టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖ‌రాన్ని అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ‌లం, సోమవ‌రం పేట గ్రామానికి చెందిన బానోత్ వెన్నెల ఈ అరుదైన ఘ‌న‌త సాధించింది. బాల్యం నుంచే పర్వతారోహణపై ఇష్టం పెంచుకున్న వెన్నెల అందుకు అవసరమైన శిక్షణ తీసుకుంది. జ‌న‌వ‌రి 19న యాత్ర ప్రారంభించి జ‌న‌వ‌రి 26న కిలిమంజారో పర్వత శిఖరం చేరుకుంది. అక్కడ మువ్వన్నెల జెండా ఎగురవేసింది. 

వెన్నెల కిలిమంజారో పర్వతం అధిరోహించిన అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్ తో ఫొటోలు దిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి ప్రపంచానికి తెలియజేసినందుకు అభినందించారు. కిలిమంజారోను అధిరోహించిన భానోత్ వెన్నెల ప్రపంచంలో అతిపెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ తన తదుపరి లక్ష్యమని చెబుతోంది. ప్రస్తుతం వెన్నెల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.