కామారెడ్డిలో హోరాహోరీ.. ముక్కోణపు పోటీలో గెలుపెవరిది?

  •     కేసీఆర్​ఇమేజ్, పోల్​ మేనేజ్​మెంట్​పైనే బీఆర్ఎస్ ​ఆశలు
  •     గజ్వేల్​ పరిస్థితులను చూపి ఓట్లడుగుతున్న కాంగ్రెస్​
  •     ప్రజా సమస్యలపై ఇన్నాళ్లూ చేసిన పోరాటాలే గెలిపిస్తాయనే ఆశలో బీజేపీ
  •     ముక్కోణపు పోటీలో గెలుపెవరిదనే ఉత్కంఠ

కామారెడ్డి, వెలుగు: రాజకీయ, సామాజిక చైతన్యానికి మారుపేరైన కామారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు హాట్​సీట్​గా మారింది. సీఎం కేసీఆర్​, టీపీసీసీ అధ్యక్షుడు ఫేస్​టూ ఫేస్​ తలపడ్తుండడంతో రాష్ట్రమంతా కామారెడ్డి వైపే చూస్తోంది. కేసీఆర్​ఇమేజ్, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గెలుపు తీరం చేరాలని బీఆర్ఎస్​భావిస్తుండగా, స్థానిక ప్రజల్లో బీఆర్ఎస్​పై ఉన్న వ్యతిరేకతే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్​నమ్ముతోంది. మరోవైపు స్థానిక సమస్యలపై తాను నడిపిన ప్రజా పోరాటాలపైనే బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

సర్కారు మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా, డ్వాక్రా మహిళలకు రావాల్సిన పావలా వడ్డీ కోసం, డబుల్​బెడ్​రూం ఇండ్ల కోసం ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్​సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ధరణి సమస్యలపై రైతులు ఏకంగా అమరణ నిరహార దీక్షలకు దిగారు. వీరంతా ఇప్పుడు ఎటువైపు నిలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కామారెడ్డి నియోజకవర్గ ప్రధాన సమస్యల్లో సాగునీటి సమస్య ఒకటి. కాళేశ్వరం లింకు కెనాల్స్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పిన సర్కారు, ఆ పనిచేయకపోవడం కూడా అధికార పార్టీకి మైనస్​గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్​గెలుపు అంత ఈజీ కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 

పోల్​ మేనేజ్​మెంట్​పైనే బీఆర్ఎస్​ ఆశలు.. 

సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ను కాదని కామారెడ్డి నుంచి కేసీఆర్​బరిలోకి దిగారు. దీంతో ఆయన తన రాజకీయాల కోసం బీసీ లీడర్​ను బలిచేశారనే భావన వెనుకబడిన వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది బీఆర్ఎస్​కు కొంతవరకు మైనస్​కావచ్చంటున్నారు. ఇక కేసీఆర్​పోటీ చేస్తుండడంతో కామారెడ్డిలో పార్టీ వ్యవహారాలన్నింటినీ కేటీఆర్​తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి100  మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జ్​ను నియమించిన ఆయన.. ప్రచార, బూత్, గ్రామ, మండల కమిటీలు సమన్వయంతో పనిచేసేలా నేతలను మోటివేట్​చేస్తున్నారు. అసంతృప్తులను స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రముఖులతో వరుసగా భేటీ అయ్యారు. కాగా, బీఆర్ఎస్​ లీడర్లకు లబ్ధి చేకూర్చేలా మార్చిన కామారెడ్డి మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు కొన్ని నెలలుగా పోరాడుతున్నారు.

ఈ ప్రభావం ఎన్నికలపై పడకుండా మాస్టర్​ప్లాన్​బాధిత గ్రామాల రైతు ఐక్య కార్యచరణ కమిటీ  ప్రతినిధులతో కేటీఆర్​ఇటీవల చర్చలు జరిపారు. మాస్టర్​ ప్లాన్​రద్దయ్యిందని, ఇప్పటికే  దీనిపై మున్సిపాల్టీలో తీర్మానం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్​గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుండడంతో.. కామారెడ్డికి స్పెషల్​ఆఫీసర్​ను పెడతామని, ఎప్పట్లాగే గంప గోవర్ధన్​కూడా అందుబాటులో ఉంటారని సర్దిచెప్తున్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులను ఎన్నికల తర్వాత 9 నెలల్లో పూర్తిచేస్తామని, అందరికీ డబుల్​బెడ్​రూం ఇండ్లు కట్టిస్తామని కూడా కేటీఆర్​హామీ ఇస్తున్నారు. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఎన్నికల ముందు ఇచ్చే హామీలను జనం ఎంతవరకు నమ్ముతారనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా కేసీఆర్​ఇమేజ్, పోల్​మేనేజ్​మెంట్​పైనే రూలింగ్​పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు చర్చ జరుగుతోంది.

ఐదేండ్లుగా ప్రజల్లోనే బీజేపీ అభ్యర్థి

బీజేపీ స్థానిక నేత, మాజీ జడ్పీ చైర్మన్​కాటిపల్లి వెంకట రమణారెడ్డిని  బరిలోకి దింపింది. 2018 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఈయన పోటీ చేసి ఓడిపోయారు. అయినా, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై  ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా ఆయా గ్రామాల రైతులను కూడగట్టి ఉద్యమాలు చేశారు. ఈ పోరాటం రాష్ట్రంలోని మిగతా ఏరియాలకు పాకడంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. డ్వాక్రా మహిళలకు రావాల్సిన పావలా వడ్డీ బకాయిలపై మహిళలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు.

ధరణిలో రైతుల సమస్యలపై ఆమరణ దీక్ష చేశారు. డబుల్ బెడ్​రూం ఇండ్లతో పాటు పలు రకాల స్థానిక సమస్యలపై ఉద్యమించారు. కుల సంఘాలకు సొంత పైసలతో  బిల్డింగులను నిర్మించి ఇచ్చారు. రూ. 50 కోట్లతో  సొంత మేనిఫెస్టో ప్రకటించారు. అందులో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజా పోరాటాలు, తాను చేసిన సామాజిక కార్యక్రమాలు గెలుపుకు సహకరిస్తాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువత మద్దతు కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్​అభ్యర్థులు నాన్​లోకల్​అని, తాను లోకల్​అంటూ ప్రచారం  చేస్తున్నారు. 

గజ్వేల్​ పరిస్థితులే ఎజెండాగా కాంగ్రెస్​.. 

కేసీఆర్ ​కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడంతో ఆయనను దీటుగా ఎదుర్కొని విజయం సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్​ హైకమాండ్​ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డిని పోటీకి దింపింది. లిస్టు రాకముందు ఇక్కడి నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్​ అలీ ప్రకటించడమే కాకుండా నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, అధిష్టానం అనూహ్యంగా రేవంత్​రెడ్డి పేరు ప్రకటించింది. 

ALSO READ : నన్ను గెలిపించండి.. మధిరను మరింత అభివృద్ధి చేస్తా : లింగాల కమల్​రాజు

దీంతో షబ్బీర్​ అలీ నిజామాబాద్​ అర్బన్​ స్థానానికి వెళ్లారు. కామారెడ్డిలో కాంగ్రెస్​కు ఓటు బ్యాంక్​ఉంది. మరో వైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, మాస్టర్​ప్లాన్​పై రైతుల ఉద్యమం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. దీంతోపాటు మండలాల వారీగా ఇన్​చార్జీలను నియమించారు. ముమ్మరంగా ప్రచారం నిర్వహించడంతో పాటు  ఆయావర్గాలు, కుల సంఘాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్​రెడ్డి కూడా మండల కేంద్రాలతో పాటు, మేజర్​గ్రామాలు, టౌన్​లో కార్నర్​ మీటింగులు పెడుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్​పై విరుచుకుపడుతున్నారు.

ఇంతకుముందు గజ్వేల్​ నుంచి పోటీ చేసిన కేసీఆర్​ వేల కోట్ల విలువైన భూములను డెవలప్​మెంట్​ పేరిట రైతుల నుంచి గుంజుకున్నారని, కబ్జాలు చేశారని ఆరోపిస్తున్నారు. గెలిచిన తర్వాత గజ్వేల్​ ముఖం చూడలేదని, రేపు కామారెడ్డిలో గెలిస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందని, ఆలోచించి ఓటెయ్యాలని కోరుతున్నారు.  మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​ నిర్వాసితులకు అన్యాయం చేశాడని, కేసీఆర్​ ఎక్కడ పోటీ చేసినా ఆ నియోజకవర్గానికి నష్టమే తప్ప లాభం ఉండదంటున్నారు. కామారెడ్డి భూములపై కేసీఆర్​ కన్నేశాడని, దాన్ని అడ్డుకోవడానికే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. రేవంత్​రెడ్డి తమ్ముడు కొండల్​రెడ్డి కామారెడ్డిలోనే ఉంటూ  ప్రచారం చేస్తున్నారు.    

2018లో కామారెడ్డిలో   పార్టీలకు వచ్చిన ఓట్లు

పార్టీ                     అభ్యర్థి                      వచ్చిన ఓట్లు
బీఆర్ఎస్        గంప గోవర్ధన్                  68,167
కాంగ్రెస్       షబ్బీర్అలీ                           63,160
బీజేపీ     వెంకటరమణా రెడ్డి      15,439

ప్రస్తుత ఓటర్ల వివరాలు

 మొత్తం ఓటర్లు  2,52,460
మహిళలు 1,30,417
పురుషులు   1,22, 019
థర్డ్​జండర్​.    24