కేసీఆర్పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టే: మంత్రి కేటీఆర్

కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టేనని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ప్రకటన రాగానే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని తెలిపారు. కామారెడ్డిలో కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలని చెప్పారు. ఇక్కడ కేసీఆర్ గెలుపు ఖాయమైంది.. తేలాల్సింది మెజార్టీయేనని వ్యాఖ్యానించారు. 

ఈ ఎన్నికతో దక్షిణ భారతదేశంలోనే సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టిస్తారని పేర్కొన్నారు. నెర్రెలు బారిన నేలలో పచ్చని పంటలు పండించాలన్నదే కేసీఆర్ ధ్యేయమని తెలిపారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం.. ధృడమైన సంకల్పం ఉంటుందని అన్నారు. 

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు గుండెల నిండుగా ఆశీర్వదించాలని కోరారు. 8 మండలాల్లో స్థానిక ఎన్నికల్లో క్లాన్ స్వీప్ చేశామన్నారు. దక్షణ భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని తెలిపారు. కేసీఆర్ పథకాల కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 

కామారెడ్డి నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని చెప్పారు. జలసాధన ఉద్యమానికి సీఎం కేసీఆర్ కామారెడ్డిలో శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నిధుల సేకరణకు కామారెడ్డిలోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. 

2004 లో పొత్తులో భాగంగా కామారెడ్డిలో కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతీ నాయకుడు స్థానిక బూత్ లో మెజార్టీకి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామం, వార్డులో మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. 2001 లో జలదృశ్యం నుంచి తెలంగాణ ఉద్యమ సందేశంతో కామారెడ్డి కదిలారని వివరించారు. ముదిరాజ్ లకు మరిన్ని అధికారిక పదవులు ఇస్తామన్నారు.