భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ/మణుగూరు, వెలుగు : గత సీఎం కేసీఆర్ నిర్వాకంతోనే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి చేరిందని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కే.వెంకటరమణారెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం కొత్తగూడెం, మణగూరు, పాల్వంచలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు.
కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో దేశం అభివృద్ధి చెందేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు రెండు స్థానాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్, జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, స్థానిక నాయకులు ఉన్నారు.