తల్లి పైసల కోసం పంచాయితీ.. అన్నను వెంటాడి చంపిన తమ్ముడు

కామారెడ్డి, వెలుగు : సోదరుడు చనిపోతే తల్లికి వచ్చిన ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం అన్నదమ్ములు గొడవపడ్డారు. ఇదే కోపంతో మద్యం మత్తులో అన్నను వెంబడించి రాళ్లతో కొట్టి చంపేశాడు తమ్ముడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. టౌన్​ సీఐ నరేశ్​, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఉంటున్న  ఫాతిమాబేగంకు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు.  పెద్ద కొడుకు ఖాజా కొంత కాలం క్రితం యాక్సిడెంట్​లో చనిపోయాడు. 

మృతుడి భార్యకు రూ.4 లక్షలు, తల్లి ఫాతిమా బేగంకు రూ.2.80 లక్షలు ఇన్సూరెన్స్​పైసలు వచ్చాయి. అందులోని రూ.80 వేలను  ఫాతిమా బేగం తన ముగ్గురు కొడుకులతో పాటు బిడ్డకు సమానంగా పంచి ఇచ్చింది. మిగతా డబ్బులు తన దగ్గరే పెట్టుకుంది. ఈ పైసలు నాక్కావాలంటే నాక్కావాలంటూ అన్నదమ్ములు కొద్ది రోజులుగా గొడవపడతున్నారు. బుధవారం రాత్రి టౌన్​లోని ఓ వైన్స్ ​పర్మిట్​రూమ్​లో ముగ్గురన్నదమ్ములు మద్యం తాగారు.  

 బయటకు వచ్చి పైసల కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అన్న అంజాద్​( 40) పై తమ్ముడు  సాదిక్ ​దాడి చేయబోగా రోడ్డుపై పరిగెత్తాడు. అయినా వదలని సాదిక్​...రాళ్లతో కొడుతూ వెంట పడ్డాడు. పాత బస్టాండ్ ​ఏరియాకు వెళ్లిన  తర్వాత బండతో మోది హత్య చేశాడు. ఘటనా స్థలాన్ని టౌన్​ పోలీసులు, క్లూస్​ టీమ్స్​పరిశీలించాయి. హత్యకు మరో తమ్ముడు సలీం కూడా సహకరించి ఉండవచ్చని సీఐ అనుమానం వ్యక్తం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.