వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.. కామారెడ్డి జిల్లాలో 16 కేసులు నమోదు

 వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.. కామారెడ్డి జిల్లాలో 16 కేసులు నమోదు

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై బుధవారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా  69 చోట్ల తనిఖీలు చేపట్టి  16 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అనుమానం ఉన్న ఆఫీసులు, ఇండ్లలో తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 

 కామారెడ్డి డివిజన్​లో 42 చోట్ల తనిఖీలు చేసి 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఎల్లారెడ్డి డివిజన్​లో 12 చోట్ల తనిఖీలు చేయగా, 5  కేసులు,  బాన్సువాడ డివిజన్​లో15 చోట్ల తనిఖీలు చేయగా, 3 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. అధిక వడ్డీల వసూళ్ల వల్ల అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జిల్లావ్యాప్తంగా ఫిర్యాదు రాగా, దాడులు నిర్వహించామని ఎస్పీ పేర్కొన్నారు.  

లింగంపేటలో పోలీసుల సోదాలు  డాక్యుమెంట్లు, నగదు సీజ్​ 

లింగంపేట, వెలుగు :  మండల కేంద్రంలోని పలువురు ఫైనాన్స్​ యజమానుల ఇండ్లల్లో బుధవారం ఎల్లారెడ్డి సీఐ రవీందర్​నాయక్​ ఆధ్వర్యంలోన సోదాలు నిర్వహించారు.  పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసి డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి సీఐ  తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేశ్​చంద్ర ఆదేశాల మేరకు లింగంపేటకు చెందిన జక్కనిబాబా, కౌడరవి, పారిపల్లి సంతోష్ ఇండ్లలో సోదాలు చేశామన్నారు. వీరి ఇండ్లలో వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన ఎలాంటి  డాక్యు మెంట్లు దొరకలేదని  చెప్పారు. 

అనంతరం కొత్త సంతోష్​ దుకాణంలో సోదాలు నిర్వహించగా నాలుగు డాక్యుమెంట్లు, బంగారం తనఖా పెట్టుకున్న ఒక డాక్యుమెంట్, రూ.90 వేల నగదు లభించినట్లు చెప్పారు. డాక్యుమెంట్లు, నగదును సీజ్ చేసినట్లు వివరించారు.  కొత్త సంతోష్​పై మనీ లెండరింగ్​ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. సోదాల్లో ఇన్​చార్జి ఎస్సై ప్రకాశ్​నాయక్​, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.