భర్తను హత్య చేయించిన భార్య

భర్తను హత్య చేయించిన భార్య
  • ఏడాది కిందటి మిస్సింగ్​ కేసును ఛేదించిన పోలీసులు
  • నలుగురు నిందితుల అరెస్ట్​

కామారెడ్డి, వెలుగు :  ఏడాది కింద మిస్సింగ్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు.  ప్రియుడు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి భార్యే భర్తను హత్య  చేయించింది. కేసు ఎస్పీ దృష్టికి వెళ్లడంతో స్పెషల్ దర్యాప్తుతో చేయగా  దారుణ ఘటన వెలుగు చూసింది. గురువారం కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి  వివరాలను వెల్లడించారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లికి చెందిన గొల్ల తిరుపతి (45) కొంత కాలం గల్ఫ్ లో ఉండి వచ్చాడు. ఇతడి భార్య మనేవ్వకు  అదే గ్రామానికి చెందిన కందూరు లింబయ్య అలియాస్​ లింబాద్రితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

తిరుపతి గల్ఫ్ నుంచి సొంతూరుకు రావటంతో  వివాహేతర సంబంధానికి అడ్డు ఏర్పడింది.  కందూరు లింబయ్య అలియాస్​ లింబాద్రి  తన  స్నేహితులైన  షేక్​ హయ్యత్ అలియాస్​ భాషా,  ధరణి లింబయ్య కు తిరుపతిని హత్య చేసేందుకు పైసలు ఇచ్చాడు.  నలుగురు కలిసి తిరుపతిని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. 2024  ఫిబ్రవరి 19న  రాత్రి తిరుపతిని మందు తాగుదామని చెప్పి కారులో ఎక్కించుకొని నిజామాబాద్​ జిల్లా పరిధిలోని డొంకల్ శివారు ఫారెస్ట్​ ఏరియాకు తీసుకెళ్లారు. 

 మందు తాగించి తిరుపతి మెడకు టవల్ వేసి గట్టిగా లాగి హత్య చేశారు. తర్వాత పెట్రోల్ పోసి తగుల బెట్టారు.  మరుసటి రోజు కాలిపోయిన ఎముకలను అక్కడే గుంత తీసి పూడ్చారు. మృతుని అన్న నాగమల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుపై  రామారెడ్డి పోలీస్ స్టేషన్​లో మిస్పింగ్​ కేసు నమోదు కాగా,  ఎస్పీ రాజేశ్ చంద్ర దృష్టికి వచ్చింది. ఏఎస్పీఆధ్వర్యంలో స్పెషల్​ టీమ్ దర్యాప్తు చేయగా హత్య జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  గురువారం  తహసీల్దార్ సమక్షంలో మృతుడికి సంబంధించిన  అవశేషాలను బయటకు తీశారు. 

మృతుడి భార్య మనేవ్వ, ఆమె ప్రియుడు కందూరి లింబయ్య అలియాస్​ లింబాద్రి,   షేక్ హయ్యత్ అలియాస్​ భాషా,  ధరణి లింబాద్రిలను అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. వీరి నుంచి కారు, 2 బైక్​లు, 3 సెల్​ఫోన్లు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.  ఏఎస్సీతో పాటు, కామారెడ్డి రూరల్​ సీఐ రామన్​, క్రైం టీమ్​ను ఎస్పీ అభినందించారు. మిస్సింగ్​ కేసు ఎంక్వైరీ చేయటంలో నిర్లక్ష్యం వహించిన రామారెడ్డి ఎస్సై  వై. నరేష్​ను సస్పెండ్​ చేశారు.