- ఎస్సై, మహిళా కానిస్టేబుల్,మరో యువకుడి మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం
- కేసు మిస్టరీని ఛేదించే పనిలో కామారెడ్డి పోలీసులు
కామారెడ్డి, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు గానీ, ఇతర ఆధారాలు గానీ ఏమీ లేవు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ లు, పోస్టుమార్టం రిపోర్టులు కీలకంగా మారాయి. ఈ నెల 25న భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట స్టేషన్ లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, బీబీపేటకు చెందిన సొసైటీ ఆపరేటర్ నిఖిల్ సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి చెరువులో పడి చనిపోయారు.
ఒకేసారి ముగ్గురు చనిపోవడం, వారిలో ఇద్దరు పోలీసు శాఖకు చెందిన వారు కావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు దొరికిన ప్రాథమిక సమాచారం మేరకు అసలు వీళ్ల ముగ్గురి మధ్య ఏం జరిగి ఉంటుందనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. నిఖిల్, శృతి మధ్య పెండ్లి ప్రస్తావన ఆంశంపై చర్చించుకునేందుకు వీళ్లు ముగ్గురు చెరువు వద్దకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మధ్య నెలకొన్న సమస్యపై మాట్లాడుకుంటున్న క్రమంలో శృతి సడెన్ గా చెరువు వైపు పరుగెత్తి అందులో దూకి ఉంటుందని, ఆమెను కాపాడేందుకు నిఖిల్ దూకగా.. వాళ్లిద్దరినీ కాపాడేందుకు ఎస్సై దూకి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
టెక్నికల్ డేటానే కీలకం..
ఈ కేసు ఎంక్వైరీలో టెక్నికల్డేటా కీలకం కానుంది. నీళ్లలో మునగడంతోనే ముగ్గురూ చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ముగ్గురికి సంబంధించి 5 సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ఎస్సైవి 2, యువకుడివి 2, మహిళా కానిస్టేబుల్ ది ఒక్కటి ఉంది. ఈ ఐదింటిని ఫోరెన్సిక్ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా ఫోన్ కాల్ రికార్డింగ్స్, వాట్సాప్ డేటా సేకరించనున్నారు. మరోవైపు చనిపోయిన వ్యక్తుల బాడీలోని లంగ్స్‌లో ఉన్న నీళ్లను కూడా ల్యాబ్‌కు పంపించనున్నారు.
ఈ నీళ్లను, చెరువులోని నీళ్లతో సరిపోల్చనున్నారు. ఇందుకోసం చెరువులోని నీటి శాంపిల్స్ పోలీసు సిబ్బంది శనివారం సేకరించారు. కాగా, ఎస్పీ సింధూశర్మ కేసు ఎంక్వైరీ గురించి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ సంతోష్‌ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు కూడా కేసు ఎంక్వైరీపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దీన్ని సాధ్యమైనంత తొందరగా కంప్లీట్చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.