ఊరికో పోలీస్​ ఆఫీసర్..​ క్రైమ్​ కట్టడిపై స్పెషల్​ ఫోకస్​

ఊరికో పోలీస్​ ఆఫీసర్..​ క్రైమ్​ కట్టడిపై స్పెషల్​ ఫోకస్​

కామారెడ్డి​, వెలుగు :శాంతిభద్రతల సంరక్షణతోపాటు నేరాల కట్టడికి కామారెడ్డి పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర ఆదేశాలతో విలేజ్ ఆఫీసర్ల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో గ్రామానికి ఒక్కో పోలీస్​ ఇన్​చార్జిని నియమించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. తమకు కేటాయించిన గ్రామానికి ప్రతిరోజు వెళ్లి  పరిస్థితులను పర్యవేక్షించి ఏదైనా ఘటన జరిగితే అక్కడికక్కడే చక్కదిద్దనున్నారు.  నేరాల నివారణపై పల్లె ప్రజలకు అవగాహన కల్పించి, చోరీలకు యత్నిస్తే ఎలా ఎదుర్కొవాలో అవగాహన కల్పిస్తున్నారు. 

పరిస్థితి అదుపు తప్పితే సమాచారమిచ్చేలా కొందరు యువకులను ఎంపిక చేస్తున్నారు. తరచూ గ్రామాలను పర్యవేక్షించడం వల్ల నేరాలు, చోరీల కట్టడితోపాటు విచారణకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా సేకరించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  ఎల్లవేళల పోలీస్​ ఆఫీసర్ అందుబాటులో ఉండడం వల్ల ప్రజల్లోనూ భరోసా పెరగనుంది. గతంలో ఊరు, వార్డుకు  పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ  ఉన్నప్పటికీ మధ్యలో నిలిచిపోయింది. ఇటీవల ఎస్పీ  జిల్లాలో నేరాలపై రివ్యూ చేసిన తర్వాత విలేజీ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పునరుద్ధరించారు.

గ్రామాల కేటాయింపు...

జిల్లాలో 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో పని చేసే కానిస్టేబుల్స్​, హెడ్​కానిస్టేబుల్స్​ను గ్రామాల్లో విలేజీ పోలీస్ ఆఫీసర్​గా,  మున్సిపాలిటీల పరిధిలో వార్డు పోలీస్ ఆఫీసర్​గా నియమిస్తున్నారు.  ఒక్కొక్కరికీ 2 లేదా 3 గ్రామాలు, వార్డులు కూడా ఉంటాయి. ఇప్పటికే జిల్లాలోని 80 శాతానికి పైగా గ్రామాల్లో ఆఫీసర్లను నియమించి దిశానిర్ధేశం చేశారు. 

అనుక్షణం నిఘా ..

విలేజ్​ పోలీస్​ ఆఫీసర్లతో పల్లెలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో అనుక్షణం నిఘా ఉండనుంది. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడం వల్ల సమాచార సేకరణ సులువు కానుంది.  ప్రధానంగా చోరీలు, హత్యలు,  సైబర్​క్రైమ్స్​, ఆన్​లైన్​​బైట్టింగ్స్, రోడ్డు ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల రవాణా,  ఆత్మహత్యల నియంత్రణపై స్థానికులకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురానున్నారు. ఇప్పటికే విలేజ్​ ఆఫీసర్లు తమకు కేటాయించిన పల్లెలు, వార్డులకు వెళ్లి  మీటింగ్​లు కూడా నిర్వహించారు.  సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల  అసత్య ప్రచారాలపై కూడా నిఘా ఉండనుంది.

ప్రజలకు అందుబాటులో పోలీస్​

ప్రజలకు నిరంతరం విలేజీ, వార్డు పోలీస్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. చోరీలు, నేరాలు, హత్యలు, ఆత్మహత్యల నివారణకే ఈ ప్రక్రియను ప్రారంభించాం.  గ్రామాల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా విలేజ్​ ఆఫీసర్లను నియమించాం.  ప్రజల్లో పోలీసుల రక్షణ ఉందన్న భరోసా కల్పించి నేరాలు,  క్రైమ్ కట్టడికి  కృషి చేస్తున్నాం.  జిల్లాలో విలేజ్ పోలీస్ ఆఫీసర్​ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. రాజేశ్​చంద్ర, కామారెడ్డి ఎస్పీ