- అక్కడి ప్రజలు అరిగోస పడుతున్నారంటున్న బీజేపీ లీడర్లు
- ఓటమి భయంతోనే కామారెడ్డికి సీఎం వస్తున్నారంటూ కాంగ్రెస్కామెంట్స్
- గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి చూడండంటూ బీఆర్ఎస్ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు
కామారెడ్డి, వెలుగు: ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని ప్రకటించడంతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. గజ్వేల్‌లో చేసిన అభివృద్ధి శూన్యమంటూ ప్రతిపక్షాలు తమ విమర్శనాస్త్రాలకు ఎక్కుపెట్టాయి. బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఈ నెల 1న చలో గజ్వేల్ ప్రోగ్రామ్‌కు నిర్వహించేందుకు ప్రయత్నించింది. అభివృద్ధి మాటున అధికార బీఆర్ఎస్ లీడర్లు గజ్వేల్ జరిగిన విధ్వంసాలు, ప్రజల ఇబ్బందులు, మల్లన్నసాగర్ బాధితుల కష్టాలు చూపెడతామని చెప్పింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రోగ్రామ్ జరగకపోయినా, స్థానికంగా గజ్వేల్ అభివృద్ధిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. గడిచిన పదేండ్లలో భూకబ్జాలు, పేద ప్రజలకు వేధింపులే తప్పా, అక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదంటూ బీజేపీ లీడర్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
స్టేట్ లీడర్లతో చలో గజ్వేల్
గజ్వేల్‌కు వెళ్లనీయకుండా బీజేపీ శ్రేణులను అరెస్ట్‌చేయడంపై ఆ పార్టీ నేతలు ఫైరయ్యారు. పార్టీ అధిష్టానం కామారెడ్డి లీడర్లను హైదరాబాద్‌కు పిలుపించుకొని మాట్లాడారు. పార్టీ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, నేషనల్ వైస్ప్రెసిడెంట్డీకే అరుణ తదితరులు చలో గజ్వేల్ ప్రోగ్రామ్‌ను అడ్డుకోవడంపై పోలీసులపై ఫైరయ్యారు. స్టేట్ముఖ్యనేతలమంతా కలిసి త్వరలోనే చలో గజ్వేల్ప్రోగ్రామ్ నిర్వహిస్తామని, అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటో నిగ్గు తేల్చుతామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రకటించారు. దీంతో ఈ టాపిక్రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ ప్రచారం
గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా వేదికగా అక్కడ జరిగిన అభివృద్ధిపై ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కామారెడ్డి నియోజకవర్గంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయంటూ పేర్కొంటున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు, కార్యకర్తలు వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సైతం..
గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారనే భయంతోనే కామారెడ్డిలో పోటీకి వస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇటీవల స్థానికంగా జరిగిన పార్టీ మీటింగ్‌కు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని తీసుకొచ్చి, అక్కడ జరిగిన అభివృద్ధిపై మాట్లాడించారు. అక్కడ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏం లేదంటూ ఆయన విమర్శించారు. తక్కువ రేటుకు భూములు కొని, ఎక్కువ రేటుకు అమ్ముకోవడమే బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.